పోలింగ్ కేంద్రానికి రాలేదు కానీ... ఓటు మాత్రం వేశాడు. అదెలా అనుకుంటున్నారా... ఓటంటే గ్రేటర్ ఎన్నికల్లో కాదండీ... తాను రోజూ ఇష్టంగా, బాధ్యతగా... షెట్టర్ ముందు గుంపుల్లో నిలబడి వేసే ఓటు. అర్థమైందనుకుంటా... తన ప్రాధాన్యత భవిష్యత్తు నిర్ణయించే ఓటు కంటే మందు సీసాకే.. అని మరోసారి నిర్ణయించారు కొందరు నగరవాసులు.
ఎన్నో ఆశలు, మరెన్నో ఉత్కంఠలు... పార్టీల హామీలు, నేతల తాయిలాలు... కొవిడ్ నిబంధనలు, గట్టి బందోబస్తు... లక్షల ఖర్చు, భవిష్యత్ నిర్ణయించే రోజుకు సెలవు... ఇవన్నీ నగరవాసులను పోలింగ్ కేంద్రానికి రప్పించలేకపోయాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు నిర్వహించిన ఓటింగ్‌లో అతి కష్టం మీద మూడో వంతు జనాలు మాత్రమే పోలింగ్ బూత్ వరకు కష్టపడి వచ్చారు.
ఇదంతా పక్కన పెడితే... సాయంత్రం 6 కొట్టిందో లేదో... షెట్టర్ల ముందు వందల మంది ఠంఛనుగా వాలిపోయారు. పద్ధతిగా క్యూలైన్లు కట్టి బారులు తీరారు. ఇటు పోలింగ్ సమయం ముగిసిందో లేదో... అటు మద్యం దుకాణాల ముందు రోడ్డు పొడవునా క్యూలైన్లు పేరుకుపోయాయి. తమ భవిష్యత్ కోసం కనీసం ఐదు నిమిషాలు కూడా కేటాయించలేకపోయిన కొందరు నగరవాసులు... రోడ్లపై మందు సీసాల కోసం మాత్రం బారులు తీరారు.
నవంబరు 29 నుంచి ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, హైదరాబాద్‌లలో దాదాపు 600 మద్యం దుకాణాలు మూతపడ్డాయి. 48 గంటలుగా మద్యం అందుబాటులో లేకుండా పోయింది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల పోలింగ్ ముగియగానే గ్రేటర్ పరిధిలోని వైన్స్ తెరుచుకోగా... రెండు రోజులుగా వేచి ఉన్న మందుబాబులు దుకాణాల ముందు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. నగరంలోని దాదాపు అన్ని మద్యం దుకాణాలు మందుబాబులతో రద్దీగా కనిపించాయి.