Group-1 Notification in Telangana : గ్రూప్-1 ప్రకటనలో అత్యధిక పోస్టులున్న యూనిఫాం ఉద్యోగాలకు అర్హతల్లో వెసులుబాటు లభిస్తుందనుకున్న ఉద్యోగార్థులకు నిరాశే ఎదురైంది. వయోపరిమితి మూడేళ్లు సడలించినా సివిల్స్‌తో పోల్చితే ఏడాది తక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సివిల్ సర్వీసెస్‌లో ఐపీఎస్ పోస్టుల అర్హతల్లోలాగే తెలంగాణ తొలి గ్రూప్-1లో డీఎస్పీ పోస్టులకు ఎత్తు తగ్గిస్తారని భావిస్తే ఆ వెసులుబాటూ లభించలేదు. ఇదే సమయంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఏఈఎస్) పోస్టులకు కనీస ఎత్తును పెంచడం గమనార్హం.
తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్‌లో అత్యధికంగా యూనిఫాం పోస్టులైన డీఎస్పీ 91, డీఎస్పీ జైళ్లు 2, ఏఈఎస్ 26 ఖాళీలు ఉన్నాయి. సివిల్స్ తరహా వయోపరిమితి, ఎత్తు తగ్గిస్తారని అందరూ భావించారు. నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. సివిల్స్‌లో ఐపీఎస్‌కు పురుష అభ్యర్థుల ఎత్తు 165 సెం.మీ, మహిళలకు 150 సెం.మీ. అర్హతగా ఉంది. రాష్ట్రంలో మాత్రం డీఎస్పీ పోస్టులకు ఎత్తును 167.6 సెం.మీ.గా కొనసాగిస్తూ ప్రకటన వచ్చింది. మహిళా అభ్యర్థులకూ 152.5 సెం.మీ. ఎత్తులో సడలింపు లభించలేదు. గత నోటిఫికేషన్లలో ఏఈఎస్ పోస్టులకు ఎత్తు 165 సెం.మీ.గా ఉంది. తాజాగా డీఎస్పీ పోస్టులతో సమానంగా ఈ పోస్టులకు ఎత్తు 167.6సెం.మీగా కమిషన్ నిర్ణయించింది. ఇక సివిల్స్‌కు గరిష్ఠ వయోపరిమితి 32 ఏళ్లు కాగా.. గ్రూప్-1కు అది 31 సంవత్సరాలుగానే ఉంచటం అభ్యర్థులను అసంతృప్తికి గురిచేస్తోంది.
ఓఎంఆర్‌లో సమాధానాలు ఒకేలా ఉంటే... గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. పరీక్ష తరవాత ఓఎంఆర్ పత్రాలను స్కాన్‌చేసి, కాపీలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఓఎంఆర్ షీట్‌లో చాక్‌పీస్, వైట్‌నర్ వగైరాలు వాడవద్దంది. ప్రిలిమినరీకి హాజరయ్యే అభ్యర్థుల ఫొటో తీసుకుని, బయోమెట్రిక్ సాయంతో గుర్తిస్తామని పేర్కొంది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పరీక్ష సమయంలో సమాధానాలు చేరవేసినట్టుగా భావించినా, ఓఎంఆర్‌లో సమాధానాలు ఒకేలా ఉన్నట్లుగా గుర్తించినా ఆ పత్రం చెల్లుబాటుకానిదిగా ప్రకటించనుంది. అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన అభ్యర్థులను డీబార్ చేస్తామని స్పష్టీకరించింది. ప్రధాన పరీక్షలో కంప్యూటరైజ్డ్ ప్రశ్నపత్రం ఉంటుందని, ఈ-ప్రశ్నపత్రం కోసం హాల్‌టికెట్ నంబరు యూజర్ ఐడీగా వాడాలని, పాస్‌వర్డ్‌ను పరీక్ష హాల్‌లో అందిస్తామని నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
గ్రూప్-1లో ఏవైనా పోస్టులు అదనంగా చేర్చేందుకు ప్రిలిమినరీ వరకు అవకాశం ఉంటుంది. ఆ పరీక్ష నిర్వహించేలోగా ప్రభుత్వం నుంచి అదనపు పోస్టులపై ప్రతిపాదనలు అందితే పరిశీలించి, అనుబంధ ప్రకటన జారీచేస్తుంది. ఈ పరీక్ష జరిగాక అదనపు పోస్టులు చేర్చేందుకు అవకాశం లేదు.
ఇప్పటికీ 1.83 లక్షల ఓటీఆర్‌లే! : రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు టీఎస్‌పీఎస్సీ వన్‌టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్) సవరణ, కొత్త ఓటీఆర్ నమోదు నెమ్మదిగానే కొనసాగుతోంది. సవరణకు అవకాశమిచ్చి నెలరోజులు గడుస్తున్నా నేటికీ 1.83లక్షల మంది ఉద్యోగార్థుల ఓటీఆర్‌లే కొత్త ఉత్తర్వుల ప్రకారం ఉన్నాయి. ఓటీఆర్ సవరించుకోవాలని కమిషన్ కోరడంతో పాటు ఈ-మెయిల్స్ పంపిస్తోంది. రోజుకు సగటున 6వేల మంది ఓటీఆర్‌లు నమోదవుతున్నాయి. ఓటీఆర్ సవరణ చేసుకోని అభ్యర్థులు కమిషన్ ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. ఇప్పటి వరకు కమిషన్ వద్ద 25లక్షల మంది ఓటీఆర్‌లు ఉన్నాయి. వీరిలో 1.30 లక్షల మంది మాత్రమే రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం సవరించుకున్నారు. కొత్తగా 52,693 ఓటీఆర్‌లు నమోదయ్యాయి.
ఇవీ చదవండి :