హోల్‌సేల్ మార్కెట్లు, దుకాణాలు, మాల్స్‌లో నిత్యావసర వస్తువులు సరిపడే స్థాయిలో నిల్వలు సమకూర్చుకుంటున్నారు. మాల్స్‌లో, దుకాణాల్లో ప్రతిరోజూ ఖాళీ అవుతున్న స్థాయిలో కొత్తవి సర్దుబాటు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు, ఔషధాల తయారీ సంస్థలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు లభించింది. ఆయా సంస్థలు వేగంగా ఉత్పత్తులను సిద్ధం చేస్తున్నాయి.
నెలరోజుల వరకు ఇబ్బందుల్లేవు..
ఈ సరఫరా ఏప్రిల్ 1 నుంచి నిరంతరాయంగా ఉంటుందని పలు సంస్థలు పేర్కొంటున్నాయి. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ముందస్తు వేతనాలు చెల్లించాయి. ‘‘వేతనం వచ్చినందున నెలకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేశాను. నెలరోజుల వరకు ఇబ్బందుల్లేవు.’’ అని సైదాబాద్‌కు చెందిన కొనుగోలుదారుడు తెలిపారు.
రాయితీల్లోనూ తగ్గింపు
కరోనాతో దుకాణాలు, మాల్స్ తమ సభ్యులకు ఇచ్చే రాయితీలు స్వల్పంగా తగ్గించాయి. చిల్లర వర్తకులు గరిష్ఠ ధరలకు వస్తువులు విక్రయిస్తున్నారు. ‘‘వారం క్రితం మాల్‌లో కొన్ని వస్తువులపై 15 శాతం రాయితీ ఉంటే.. ఇప్పుడు 5 శాతానికి తగ్గించారు. ‘‘డైపర్లపై 40 శాతం వరకు ఉండే రాయితీని 10 శాతానికి తగ్గించారు.’’సరకు రవాణా వాహనాలు అనుమతించినందున.. వచ్చేవారం నుంచి అవసరమైన స్టాకు ఉంటుంది.’’
పండ్ల దిగుమతిపై ప్రభావం..
పండ్ల దిగుమతి, క్రయ విక్రయాలపై కరోనా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పండ్ల కోతకు కూలీలు రాకపోవడం.. ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన లారీలు నిలిచిపోవడంతో నిల్వలు తగ్గిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతుండటంతో రవాణా వ్యవస్థలన్నీ దాదాపుగా స్తంభించాయి.
కొత్తపేట పండ్ల మార్కెట్‌కు..
హైదరాబాద్‌లోని కొత్తపేట పండ్ల మార్కెట్‌కు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా పండ్లు దిగుమతి అవుతాయి. ఇక్కడి నుంచి టోకు వ్యాపారుల ద్వారా జిల్లాలకు సరఫరా అవుతుంటాయి. గత ఐదారు రోజులుగా రాష్ట్రానికి సరకు సరిగా రావడం లేదు. క్రయ విక్రయాలు లేక వ్యాపారులు తల్లడిల్లుతుండగా..మున్ముందు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండని పరిస్థితులు కనిపిస్తున్నాయి. చిల్లర వర్తకులు, తోపుడు బండ్లపై పండ్లు అమ్ముకుని జీవించేవారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఇవీ చూడండి: పల్లెటూళ్లకు సత్వర న్యాయం.. గ్రామ న్యాయాలయం