ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ రాజ్‌భవన్ నుంచే ఆన్‌లైన్‌లో ప్రసంగించనున్నారు. ఈ నెల 16న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉదయం 10 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్‌భవన్ నుంచి ఆన్‌లైన్‌లో ప్రసంగించనున్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏర్పాటు చేసినట్లు అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. శాసనసభలో ఎమ్మెల్యేలు, శాసనమండలిలో ఎమ్మెల్సీలు ఎవరి సభలో వారు కూర్చొని గవర్నర్ ప్రసంగాన్ని విననున్నారు. గవర్నర్ ప్రసంగం రెండు సభల్లోనూ మానిటర్లలో ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేశారు.
ఉభయసభల్లోనూ సభ్యుల మధ్య ఎడం ఉండేలా సీటింగ్ కేటాయిస్తున్నారు. అయితే ప్రతిరోజూ 100మంది సభ్యులు మాత్రమే హాజరైతే బాగుంటుందన్న వాదన ఉన్నప్పటికీ, ఏ సభ్యుడినీ సభకు రావద్దని చెప్పే అధికారం ఎవరికీ లేనందువల్ల అలా చేయలేమని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. ‘కరోనా వ్యాప్తి నేపథ్యంలో 60 ఏళ్లకు పైబడిన వయసున్న సభ్యులు సభకు రావడం, రాకపోవడమనేది వారిష్టం, మేమైతే సంప్రదాయం ప్రకారం సమావేశాలకు ఆహ్వానం పంపుతాం’ అని శాసనసభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు.
ఇదీ చదవండి: ఈనెల 16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం