నెలాఖరులోగా వేతన సవరణ ప్రక్రియను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వేతన సవరణ సంఘం నివేదికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికను అధ్యయనం చేసి దాని ఆధారంగా ఉద్యోగసంఘాలతో సంప్రదింపులు జరిపేందుకు అధికారుల కమిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన ఆర్థిక, నీటిపారుదల శాఖల ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్ సభ్యులుగా కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించాల్సి ఉంది. వీలైనంత వరకు గుర్తింపు పొందిన అన్ని ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచే అవకాశం ఉంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్న వారందరినీ చర్చలకు పిలుస్తారని చెప్తున్నారు. ఇందుకోసం గత పీఆర్సీ ప్రకటన సమయంలో.. అవలంభించిన విధానాన్ని పరిశీలించే అవకాశం ఉంది.
జాప్యం చేయొద్దు..
వేతన సవరణ సంఘానికి ఏ ఏ సంఘాలు అభిప్రాయాలు ఇచ్చాయన్న వివరాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. 6, 7 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని అధికారుల కమిటీకి ముఖ్యమంత్రి సూచించారు. ఆ తేదీల్లో అటుఇటుగా చర్చలు జరిగే అవకాశం ఉంది. రెండు లేదా మూడు రోజుల్లో చర్చల ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని శాఖల్లోనూ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జనవరి నెలలో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని, జాప్యం చేయవద్దని సూచించారు. కొన్ని శాఖల్లో పదోన్నతుల కసరత్తును ప్రారంభించి.. డీపీసీలను కూడా నియమించారు. ఉద్యోగుల పదోన్నతుల విషయమై సాధారణ పరిపాలనా శాఖ, ఆర్థికశాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: రైతుబంధుతో రూ. 5,111 కోట్ల సాయం