వేతన సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం వేతన సవరణ ప్రకటించిన కేసీఆర్ సర్కారు... 2018 మే నెలలో తెలంగాణ మొదటి వేతన సవరణ సంఘాన్ని నియమించింది. సాధారణంగా ఒక్కరితోనే కమిషన్ నియమిస్తుంటారు. కానీ... త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్... ముగ్గురితో కమిషన్‌ను నియమించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారుల్లో సీఆర్ బిస్వాల్ ఛైర్మన్‌గా... రఫత్ అలీ, ఉమామహేశ్వర రావులతో కూడిన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. వేతన సవరణతో పాటు వివిధ ఇతర అంశాలను కూడా కమిషన్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఆ మేరకు విధివిధానాలు ప్రకటించింది.
పీఆర్సీ సహా ఉద్యోగుల సంబంధిత అంశాలు, సమస్యలపై కమిషన్ ఉద్యోగ సంఘాలతో పాటు వ్యక్తిగతంగానూ అభిప్రాయాలు సేకరించింది. కమిషన్ పదవీకాలం గతంలోనే పూర్తైనప్పటికీ... ప్రభుత్వం పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. ప్రస్తుతం కమిషన్ గడువు ఈ నెలాఖరు వరకు ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో వేతనసవరణ ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పీఆర్సీ కసరత్తును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి... అధికారులను ఆదేశించినట్లు సమాచారం. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఆర్థికశాఖ అధికారులు కసర్తతు చేస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటికే మంజూరు చేసిన డీఏలను పరిగణలోకి తీసుకొని ఫిట్‌మెంట్ శాతాన్ని ఖరారు చేయనున్నారు. ఎంత శాతం ఫిట్‌మెంట్ ఇస్తే ఖజానాపై ఎంత వరకు భారం పడుతుందన్న విషయంపై ఆర్థికశాఖ అధికారులు లెక్కలు తీస్తున్నట్లు సమాచారం. నెలాఖరుతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో అటు కమిషన్ కూడా ఆలోగానే నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతుందని అంటున్నారు. అందుకు అనుగుణంగానే సంకేతాలు ఉన్నాయని చెప్తున్నారు.
కమిషన్ నివేదిక అందిన వెంటనే ముఖ్యమంత్రి తమతో సమావేశం అవుతారని ఉద్యోగసంఘాలు చెప్తున్నాయి. పీఆర్సీ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా వేతన సవరణను ఖరారు చేస్తారని... ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని అంటున్నారు.