హైదరాబాద్‌లోని మణికొండలో నాలాలో పడి మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ రజినీకాంత్ కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం ప్రకటించింది. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన అధికారులు మణికొండ మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజినీర్ వితోబాను సస్పెండ్ చేశారు. మరమ్మతులు జరుతున్న సమయంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు, చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించిన గుత్తేదారు రాజ్ కుమార్‌పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నెల 25న భారీ వర్షం కురుస్తున్న సమయంలో సుమారు 9.15 గంటలకు.. పెరుగు ప్యాకెట్ కోసం సాఫ్ట్వేర్ ఇంజినీర్ రజినీకాంత్ బయటకొచ్చాడు. కాలినడకన వచ్చిన రజినీకాంత్.. నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యాడు. వర్షపు నీటితో నాలా నిండటంతో దారి కనబడక గుంతలో పడిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న ఓ వ్యక్తి వర్షం వీడియో తీస్తుండగా రికార్డ్ అయ్యింది. ఇది వైరల్ కావడంతో నార్సింగి పోలీసులు, మణికొండ మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహకారంతో డ్రైనేజి పొడవునా వెతికినా రజినీకాంత్ ఆచూకీ లభించలేదు. డ్రైనేజీ గుంతలో పడి గల్లంతైన రజినీకాంత్ మృతదేహం మూడు కిలోమీటర్లు కొట్టుకొచ్చి నెక్నాంపూర్ చెరువులో మృతదేహం కనిపించింది.
బాధిత కుటుంబానికి మంత్రి సబిత పరామర్శ
మణికొండలో గల్లంతైన రజినీకాంత్ కుటుంబ సభ్యులను మంత్రి సబిత ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి... నిర్మాణాల వద్ద జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే పైపులైన్ పనులు చేపడుతున్నా.. అధికారులు పట్టించుకోలేదన్న స్థానికుల ఫిర్యాదును అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేసిన అధికారులు.. నిర్లక్ష్యం వహించినవారిపై చర్యలు తీసుకుంది.
ఇదీ చూడండి: