Gold Bonam to Durgamma: అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మకు వైభవంగా బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన మహంకాళి జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బ్రాహ్మణవీధిలోని జమ్మిదొడ్డి వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. ప్రతి ఏటా ఆషాడ మాసంలో బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. గత 13 ఏళ్లుగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించే కార్యక్రమాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. బోనం సమర్పణ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వందల సంఖ్యలో కళాకారులు తరలివచ్చి ప్రత్యేక వేషదారణతో అమ్మవారి పట్ల తమకున్న భక్తిని చాటుకున్నారు. మేళతాళాలు, తీన్‌మార్ డప్పులు, పోతురాజుల విన్యాసాలు, కోలాటాలు, బేతాళ నృత్యాలు, విచిత్ర వేషదారణలు ఈ ప్రదర్శనకు మరింత ప్రత్యేక ఆకర్షణను ఇచ్చాయి.
అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, వడిబియ్యంతో పాటు కృష్ణమ్మ పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ, గంగతెప్పను సమర్పించారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున ఆలయ ఈవో భ్రమరాంబ, స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాదశర్మ, ఇతర అధికారులు ఉత్సవ కమిటీ ప్రతినిధులు, కళాకారులకు సాదర స్వాగతం పలికారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరపున కమిటీ ప్రతినిధులకు సముచిత మర్యాదలు చేసిన ఆలయ సిబ్బంది ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం కల్పించారు. జమ్మిదొడ్డి వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం... జోగిని విశా క్రాంతి అమ్మవారికి తొలి బంగారు బోనం సమర్పించారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్ రాకేశ్ తివారీ, మాజీ అధ్యక్షులు గాజుల అంజయ్య తదితరుల పర్యవేక్షణలో తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా జగన్మాతకు పూజలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు బోనాల ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
తెలంగాణలో బోనాల పండగకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా నిరాడంబరంగానే ఈ పండగ జరిగింది. ఈసారి ఘనంగా బోనాల పండగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బోనం అనేది భోజనం అనే పదానికి వికృతి. తమ పిల్లలను, కుటుంబ సభ్యులని మాత్రమే కాకుండా ఊరుమొత్తం చల్లగా చూడమ్మా.. అంటూ భక్తులు అమ్మవారికి భక్తితో బోనం సమర్పిస్తారు. అమ్మవారిని శక్తిస్వరూపినిగా ఆరాధించడం ఆనవాయితీ. తెలంగాణ బంగారు బోనం జాతరతో విజయవాడ నగరంలో ఆథ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరైన కళాకారులు సైతం అందరికీ అమ్మవారి దయ ఉండాలని ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: 'తెలంగాణ అభివృద్ధే మా ప్రాధాన్యత.. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చి తీరుతుంది..'
కెమిస్ట్ హత్య.. స్నేహితులదే కుట్ర.. ఆ ఎన్జీఓ కేంద్రంగానే అంతా.. దర్యాప్తు వేగవంతం!