గ్రేటర్ హైదరాబాద్‌లో డివిజన్ల విభజన గందరగోళంగా మారుతోంది. ఫలితంగా ఒక డివిజన్ ఓటర్లు.. ఇంకో డివిజన్ పరిధిలోకి వెళ్తున్నారు. పోలింగ్ కేంద్రాలు మారిపోతున్నాయి. జియాగూడ, కార్వాన్, మొఘల్‌పుర, గన్‌ఫౌండ్రీ, గౌలిపుర, ఉప్పుగూడ, జంగంమెట్, శాలిబండ, కుర్మగూడ, సైదాబాద్, అక్బర్‌బాగ్ తదితర డివిజన్లలో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది.
57,326 ఓట్ల వ్యత్యాసం..
ఫిబ్రవరి, 2020 తుది ఓటరు జాబితా ప్రకారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ 78428 ఓట్లతో మొదటిస్థానంలో ఉండగా, భారతీనగర్ 21102 ఓట్లతో చివరి స్థానంలో ఉంది. అతిపెద్ద, అతి చిన్న డివిజన్ల మధ్య 57326 ఓట్ల భారీ వ్యత్యాసం ఉండటం దారుణమని, డివిజన్ల హద్దులను నిర్ణయించడంలో చోటుచేసుకుంటున్న లోపాలు అందుకు కారణమన్న విమర్శలొస్తున్నాయి. 30 శాతం డివిజన్లలో జనాభాకు మించి ఓటర్లున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. ఓ సర్కిల్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. కేంద్ర కార్యాలయం 2016 మ్యాపుల ప్రకారం ఓటర్లను విభజించమని ఆదేశించిందని, అందువల్ల దోషాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.