హైదరాబాద్ నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు... మరికొన్ని రోజులు పడే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. శిధిలావస్థకు చేరిన భవనాలు, ప్రహరీ గోడలు, ఇతర నిర్మాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వాతావరణ శాఖ నుంచి వస్తున్న హెచ్చరికలు, కాల్ సెంటర్, వాట్సాప్, కంట్రోల్ రూమ్ నుంచి అందే ఫిర్యాదులకు తక్షణమే స్పందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
శిథిలావస్థకు చేరిన భవనాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. చాలా ప్రమాదకర నిర్మాణాల్లో నివసిస్తున్న తక్షణమే ఖాళీ చేయించి, సీజ్ చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులకు సూచించారు.పురాతన నిర్మాణాలకు నోటీసులు అంటించి, చుట్టూ బారికేడింగ్ చేయాలన్నారు. కొత్త సెల్లార్ల తవ్వకాలు నిషేధించామని, గతంలో చేపట్టిన సెల్లార్లకు రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.