Arrangements for paddy collection: వానాకాలంలో ధాన్యం సేకరణపై సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. హైదరాబాద్‌లోని ఏంసీహెచ్ఆర్డీ 2022-23 వానాకాలం మార్కెటింగ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై.. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయశాఖ వివరాల ప్రకారం రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. సొంత వినియోగం, ఇతరత్రా అవసరాలకు పోనూ దాదాపు 112లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. కొనుగోలు కేంద్రాలకు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
అవసరమైన గన్ని బ్యాగులు, తేమశాతం లెక్కించే మిషన్లు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని గంగుల స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క గింజ ధాన్యం కూడా తెలంగాణలో అమ్మకానికి తీసుకురాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని గంగుల కమలాకర్ అధికారుల్ని ఆదేశించారు. 17 జిల్లాలకు ఇతర రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న నేపథ్యంలో ధాన్యం అక్రమ రవాణా జరగకుండా పోలీస్ శాఖ సాయం తీసుకోవాలని సూచించారు.
రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా నిఘా పెట్టాలన్నారు. ఇప్పటికే మిల్లర్ల వద్ద ఉన్న 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని.. వీలైనంత త్వరగా మిల్లింగ్ చేసి సీఎంఆర్ అప్పగించాలని కోరారు. వానాకాలం ధాన్యం కోసం తగినంత స్టోరేజీ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరి సాగుపై సర్వే నంబర్లవారీగా ఏఈఓలు సేకరించిన సమాచారాన్ని ఇప్పటికే ఆన్‌లైన్ నమోదు చేసిన నేపథ్యంలో ఇతరులకు పంట విక్రయించే అవకాశం లేకుండాపోయింది. రైతులు ధాన్యాన్ని ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకోవాలని కోరిన గంగులా కమలాకర్..డబ్బులను ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: