Etela Rajender on kcr: శాసనసభకు తమను రాకుండా చేయడం కోసమే సస్పెండ్ చేశారని మాజీమంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. తనతో పాటు ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారన్నారు. కేసీఆర్.. ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద భాజపా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో పాల్గొన్న ఈటల... ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యమ బిడ్డనైన నన్ను కుట్రతో పార్టీ నుంచి బయటకు పంపారు. హుజూరాబాద్‌లో నా ఓటమికి అన్నిరకాలుగా ప్రయత్నించారు. ఆరు నెలలపాటు అధికార యంత్రాంగాన్ని అక్కడే మోహరించారు. నా ఓటమి కోసం అక్రమంగా సంపాదించిన వందల కోట్లు ఖర్చుపెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ నా ఓటమికి కృషిచేశారు. హుజూరాబాద్‌లో నన్ను అణగదొక్కాలని చూశారు. ప్రజలు.. కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకున్నారు. తెలుగు మాట్లాడే ప్రజానీకం గర్వపడేలా హుజూరాబాద్ ప్రజలు తీర్పు ఇచ్చారు. నా విజయంతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు.
ఈటల రాజేందర్, భాజపా ఎమ్మెల్యే
గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఇలాంటి ముఖ్యమంత్రి లేరని మండిపడ్డారు. 30 రోజులు జరగాల్సిన సమావేశాలను 7 రోజులే నిర్వహించారన్నారు. రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం ముఖ్యమంత్రి, స్పీకర్‌కు ఉండదని ఈటల అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన స్లిప్పుతో మమ్మల్ని సభాపతి సస్పెండ్ చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. కోర్టు ఇచ్చిన తీర్పునూ స్పీకర్ గౌరవించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రికి, మంత్రి హరీశ్‌రావుకు దమ్ముంటే బడ్జెట్ మీద చర్చకు సిద్ధమా అని ఈటల సవాల్ విసిరారు. వీళ్లకు బడ్జెట్ అంటే దొంగ లెక్కలేనని ఆరోపించారు. బడ్జెట్లో సాధ్యం కానివి ఎన్నో పెట్టారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వేలకోట్ల అప్పులు చేస్తోందని అభిప్రాయపడ్డారు. పుట్టే ప్రతి బిడ్డపై రూ.లక్షా 25 వేల అప్పుందని ఈటల తెలిపారు.
ఇదీచూడండి: BJP Deeksha in Hyderabad: ఇందిరాపార్క్ వద్ద భాజపా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష