రాష్ట్రంలో 90.75 శాతం మంది రైతులు సన్న, చిన్నకారు కమతాలవారే. వారికి ఉన్న సగటు కమతం విస్తీర్ణం 5 ఎకరాల్లోపే. మొత్తం 60.95 లక్షల మందికి వారిలో 44.22 లక్షల మంది రైతులకున్న భూమి 3 ఎకరాల్లోపే ఉందని వ్యవసాయశాఖ తెలిపింది. వీరికి పండే పంటలు 15 నుంచి 20 క్వింటాళ్లలోపే ఉంటున్నాయి. వీటిని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోవడం రైతులకు సాధ్యం కాదు. రాష్ట్రంలో పంటలకు సరైన మద్దతు ధర దక్కడం లేదని రైతు స్వరాజ్య వేదిక సంస్థ జరిపిన పరిశీలనలో తేలింది. మొక్కజొన్న, పెసర, జొన్న, సోయాచిక్కుడు పంటల సాగు, దిగుబడులు, ధరలు దక్కిన తీరుపై ఈ సంస్థ తాజాగా నివేదికను విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు.
2018-19లో మొక్కజొన్న క్వింటా మద్దతు ధర రూ.1700గా కేంద్రం ప్రకటించింది. ఆ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో రైతులకు అందిన సగటు ధర రూ.1301. 2019-20లో మద్దతు ధర రూ.1760. రైతులకు అందిన సగటు ధర రూ.2160. ప్రస్తుత ఏడాదిలో మద్దతు ధర రూ.1850 కాగా సగటున రూ.1312 పలికింది. ఈ సీజన్‌లో కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లును ఆసరా చేసుకుని ప్రైవేటు సంస్థలు, వ్యాపారులు పంట ధరను తగ్గించేశారు.
జొన్నకు 2018-19లో మద్దతు ధర రూ.2430 కాగా సగటు ధర రూ.2137. 2019-20లో మద్దతు ధర రూ.2550కి రైతులకు అందిన ధర రూ.3153. ఈ సీజన్‌లో రూ.2620కి పెంచినా ప్రస్తుతం ఇస్తున్న ధర రూ.2410.
వ్యాపారులు మార్కెట్లను నియంత్రిస్తారు
వ్యవసాయ బిల్లు చట్టంగా వస్తే కార్పొరేటు సంస్థలు, పెద్ద వ్యాపారులు వారి ప్రాంతాల్లో జమీందార్లుగా శక్తిమంతులై మార్కెట్లను నియంత్రిస్తారు. వ్యవసాయ మార్కెట్లు నిర్వీర్యమై పోతాయి.
-సారంపల్లి మల్లారెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు, అఖిల భారత కిసాన్‌సభ
మార్కెట్లు దెబ్బతినే ప్రమాదం ఉంది
వ్యవసాయ బిల్లు వల్ల మార్కెట్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. రైతు విడిగా పంటలు అమ్ముకుంటే ధర రాక నష్టపోవడం ఖాయం. వ్యాపారుల మోసాల నుంచి వారిని రక్షించే వ్యవస్థలుండాలి.
-జీవీ రామాంజనేయులు, వ్యవసాయ రంగ నిపుణులు, రైతు స్వరాజ్య వేదిక