పొద్దున్నే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనాలు.. అందరి చేతిల్లో ఓటరు కార్డులు.. చూడగానే జనం పద్ధతిగా ఓట్లేయడానికి వచ్చారు అనుకుంటాం.. కానీ.. వాళ్లంతా అక్కడి ఓటర్లే కాదు. తిరుపతిలో ఓటు వేయడానికి చిత్తూరు, కడప ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లు.. ! క్యూలైన్లలో నించున్న వారికి తమ పేరు ఏంటో తెలీదు. అడ్రస్ చెప్పలేరు. తండ్రి పేరు, భర్త పేరు చెప్పమంటే పారిపోతుంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటుహక్కు వినియోగించుకుందామని పోలింగ్ బూత్‌కు వెళితే.. అప్పటికే తన ఓటును ఎవరో వేసేసి ఉంటారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తిరుపతి ప్రాంతంలోకి వందలాదిగా బస్సులు, కార్లలో జనాలు తరలివచ్చారు. అందరి దగ్గరా ఓట్లస్లిప్పులు, గుర్తింపుకార్డులు ఉన్నాయి. ఏంటి అని అడిగితే తీర్థయాత్రకు వచ్చామంటారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఉపఎన్నికలో ఇవాళ పొద్దున్నుంచి కనిపించిన దృశ్యాలివి. పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లు.. ఓటుహక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. వందలకొద్దీ దొంగ ఓటర్లు.. తిరుపతిపై దండెత్తారు. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎటు చూసినా నకిలీ ఓటర్లు, దొంగఓట్లు వేసేవాళ్లే కనిపించారు. ఎక్కడికక్కడ తెలుగుదేశం, భాజపా, జనసేన పార్టీ నేతలు, ఏజెంట్లు.. వీరిని సాక్ష్యాలతో పట్టుకున్నారు.
'తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ రద్దు చేయాలి'
దండెత్తిన దొంగఓట్లు..
ఇవాళ ఉదయమే తిరుపతి నగరంలోని అనేక ప్రాంతాల్లో పుట్టల్లో నుంచి చీమలు వచ్చినట్లు నకిలీ ఓటర్లు బయటకు వచ్చారు. ఎక్కడికక్కడ ఉదయాన్నే బారులు తీరి దర్జాగా ఓట్లు వేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే.. వాళ్ల చేతిలో ఓటరు ఐడీ కార్డు ఉంది. కానీ అది నకిలీది. పశ్చిమం వైపు ఉన్న పోలింగ్ బూతులకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని పుంగనూరు, పలమనేరు ప్రాంతాల నుంచి... జీవకోన, మంగళం, రేణిగుంటు, శ్రీకాళహస్తి ప్రాంతాలకు కడప జిల్లా నుంచి ఓటర్లను నకిలీ ఓటర్లను తరలించారు. వీళ్లను ఏజెంట్లు స్థానిక నేతలు పట్టుకుంటే.. ఓటరు ఐడీలో ఉన్న పేర్లను కూడా చెప్పలేకపోయారు. కరోనా కారణంగా అందరూ మాస్కులు ధరించి ఉండటంతో ఎవ్వరూ గుర్తించలేకపోతున్నారు. పేర్లు అడిగితే పారిపోతున్న వీడియోలు, ప్రేవేటు బస్సుల్లో నకిలీ ఓటర్లు తరలివస్తున్న వీడియోలు పదుల సంఖ్యలో ఇవాళ వైరల్ అయ్యాయి.
పక్కా ప్రణాళికతో..
పక్కా ప్రణాళికతో అధికార పార్టీ ఈ నకిలీ ఓట్ల దందాను నడిపించిందని తెదేపా, భాజపా ఆరోపించాయి. ముందస్తు వ్యూహంలో భాగంగానే ఒరిజనల్ ఓటరు కార్డుల తరహాలో నకిలీ ఐడీ కార్డులను సృష్టించారు. బయట ప్రాంతాల వ్యక్తులకు వీటిని సరఫరా చేసి.. వాటి వెనుక ఏ పోలింగ్ బూత్ కు వెళ్లాలో స్టిక్కర్ కూడా అంటించారు. వీరిని సమన్వయం చేసుకోవడానికి మనుషులను పెట్టి బస్సుల్లో పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకొచ్చారు. దొంగ ఓట్లు వేయడానికి తాము వచ్చామని కొంతమంది మహిళలు అంగీకరించారు. కొంతమంది బస్సులో వెళ్తుండగా తెలుగుదేశం శ్రేణులు అడ్డుకునున్నారు. తమని దొంగ ఓట్లు వేయడానికి తీసుకొచ్చినట్లు తెలియదని వారు ఒప్పుకున్నారు. దొంగ ఓటర్లను తరలిస్తున్న ఓ బస్సును అధికారులు పట్టుకున్నారు. ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సులను నకిలీ ఓటర్లను తరలించేందుకు తీసుకువచ్చారు. తమకు ఒక్కో ప్రాంతం కేటాయించారని ఎన్నికల అధికారులు సీజ్ చేసిన బస్ డ్రైవర్ స్పష్టం చేశారు.
తిరుపతిలో దొంగ ఓట్లు.. ఎలా వేస్తున్నారో చూశారా?
అడ్డంగా దొరికారు..
ప్రతీ చోటా వీళ్లు ఓట్లు వేస్తూ నాయకులకు దొరికిపోయారు. 47వ డివిజన్ 219 పోలింగ్ బూత్ పరిశీలనకు వెళ్లిన తెలుగుదేశం అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి పనబాకలక్ష్మి స్వయంగా దొంగ ఓటర్లను గుర్తించి పోలీసులకు అప్పగించారు. తిరుపతి ఎస్పీజీఎన్ఎమ్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద భాజపా అభ్యర్థి రత్నప్రభ కూడా నకిలీ ఓటర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు దొంగ ఓట్లను అడ్డుకోవట్లేదంటూ తిరుపతి పశ్చిమ పీఎస్ ఎదుట ఆమె ఆందోళన చేశారు.
భాజపా జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు శాంతారెడ్డి ఓ పోలింగ్ కేంద్రంలో క్యూకట్టిన నకిలీ ఓటర్లను పదుల సంఖ్యలో పట్టుకున్నారు. తిరుపతి 152-A పోలింగ్ బూత్‌లో ఏకంగా భాజపా ఏజెంట్ ఓటునే నకిలీ వ్యక్తి వేసేయగా.. ఆ తర్వాత తేరుకుని పోలీసులకు అప్పగించారు. ఇక ప్రైవేటు బస్సుల్లో, కార్లలో పెద్ద ఎత్తున తరలివచ్చిన నకిలీ ఓటర్లను తెలుగుదేశం నేతలు ఎక్కడికక్కడ గుర్తించి పట్టుకున్నారు. వీళ్లెవరూ సరైన సమాధానం చెప్పలేక జారుకున్నారు.
పోలింగ్ రద్దు చేయాలి..
తిరుపతి ఎన్నికను అధికార పార్టీ అపహాస్యం చేసిందని తెదేపా ధ్వజమెత్తింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లను తరలించుకువచ్చారని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా నేతలు ఆరోపించారు. పెద్దిరెడ్డికి చెందిన కల్యాణమండపంలో వేలాది నకిలీ ఓటర్లను దాచారని ఆరోపించారు. సాక్ష్యాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తిరుపతి పోలింగ్‌ను రద్దు చేయాలని చంద్రబాబు సీఈసీకి లేఖ రాశారు. వైకాపా యథేచ్చగా అక్రమాలకు పాల్పడిందని భాజపా అభ్యర్థి రత్నప్రభ ధ్వజమెత్తారు. నకిలీ ఓటర్లను పట్టించినా పట్టించుకోవడం లేదంటూ స్వయంగా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. పోలింగ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఎన్నికల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి చింతా మెహన్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: నాలుగు రోజుల్లోగా పట్టణాల్లో చెత్త కనిపించొద్దు: కేటీఆర్