కేంద్ర బడ్జెట్ 2021 దేశచరిత్రలో ఒక చారిత్రకమైనదని కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. యురోపియన్ యూనియన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై.. కరోనా తీవ్ర ప్రభావం చూపిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ బడ్జెట్ కొత్త ఒరవడిని తీసుకుని వస్తుందన్నారు. 2021-22 సంవత్సరంలో రెండంకెల వృద్ధి సాధిస్తామని సురేశ్ ప్రభు ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ భాజపా రాష్ట్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో కలిసి సురేశ్ ప్రభు మీడియా సమావేశం నిర్వహించారు. కొత్త ఆర్థిక విధానానికి ఈ బడ్జెట్ ఊతమిస్తుందన్నారు. మోదీ ప్రధాని అయిన తరువాత రైతుల ఆదాయం రెండింతలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని వివరించారు. వ్యవసాయానికి ఈ బడ్జెట్లో రూ. 16.57లక్షల కోట్ల కేటాయించారని చెప్పుకొచ్చారు. రక్షణ రంగానికి మోదీ ప్రభుత్వం మొదటి నుంచే ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.
ఉక్కు పరిశ్రమ అక్కడే..
విశాఖ రైల్వే జోన్ పాలనాపరమైన అంశమని, రైల్వేలో మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్ పెంచుతున్నామన్నారు. ఉక్కు ఫ్యాక్టరీలో 1991 నుంచే షేర్ల ప్రక్రియ మొదలైందన్నారు. స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుందన్న సురేశ్ ప్రభు.. ప్రైవేటు వారు రాని సమయంలో ప్రభుత్వమే నిధులు సమకూర్చిందని స్పష్టం చేశారు. చర్చల ద్వారానే రైతు సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు.
విభజన హామీల అమలుకు..
క్లిష్ట పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కాబట్టి.. ఇది ప్రత్యేకమైందని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. వైద్యం, ఆరోగ్యం, మౌలిక వసతులు వ్యవసాయంకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంకు కేటాయించని నిధులు ఏపీకి కేంద్రం కేటాయించిందని తెలిపారు. విభజన చట్టం హామీలు అమలు చేసుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని సూచించారు.
ఇవీ చూడండి: 'సివిల్స్' అభ్యర్థులకు కేంద్రం శుభవార్త