EC-Vikram Device News: ‘ఒక్క పరికరంతో ఆరు రకాల ఆరోగ్య పరీక్షలు చేసుకోవచ్చు. ఎక్కువ సమయం కూడా అక్కర్లేదు. శరీర ఉష్ణోగ్రత ఎంత? నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటోంది? ఆక్సిజన్ ఎంత శాతం ఉంది? నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నారు? రక్తపోటు ఎంత ఉంది? వంటి విషయాలను తెలుసుకోవచ్చు. ఈసీజీ కూడా తీసుకోవచ్చు. అరచేతిలో పట్టే ఈ పరికరంతో ఎవరి సాయం లేకుండా పరీక్షించుకోవచ్చు. ఫలితాలను మొబైల్‌లో చూసుకోవచ్చు. వైద్యుడికి నేరుగా చూపించొచ్చు.. లేదంటే నగరంలో ఉన్న వైద్యుడిని సంప్రదించి టెలీమెడిసిన్ ద్వారా చికిత్స పొందొచ్చు’ అంటోంది ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్).
అణు, రక్షణ, వైమానిక, భద్రత, ఐటీ, టెలికాం, ఈ-గవర్నెన్స్‌కు సంబంధించి ఎన్నో ఉత్పత్తులను అందించిన ఈసీఐఎల్ నుంచి సామాన్యులకు వైద్య పరీక్షలను చేరువ చేసేందుకు రూపొందించిన నూతన ఆవిష్కరణ ‘ఈసీ-విక్రమ్’. వినూత్నమైన ఈ పరికరం ఇంటర్‌నెట్ ఆధారంగా పనిచేస్తుంది. మారుమూల ప్రాంతాల్లో ఉండేవారికి సైతం ఉపయోగపడేలా ఈసీఐఎల్ రిమోట్ వేరబుల్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ (ఆర్‌హెచ్‌ఎంఎస్)ను అభివృద్ధి చేసింది. దీనిని చేతికి సులువుగా ధరించవచ్చు. సంబంధిత యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా సమాచారం తెలుసుకోవచ్చునని ఈసీఐఎల్ అధికారులు ‘ఈటీవీ- భారత్'కు వివరించారు. ఈ పరికరం కొనుగోలు చేయాలనుకునే వారు తమ మార్కెటింగ్ విభాగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. https://gem.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చని వారు వివరించారు.
కమ్యూనిటీలకు ఉపయోగకరం..
'రూ.30వేలకు పైగా విలువ చేసే ‘ఈసీ-విక్రమ్’ పరికరం టెలీ మెడిసిన్ సేవలకు ఉపయోగకరం. కమ్యూనిటీల్లో వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈసీఐఎల్‌లోనే వీటిని ఉత్పత్తి చేస్తున్నాం. ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థల నుంచి ఆర్డర్ల మేరకు ఈసీఐఎల్‌లోనే ఉత్పత్తి చేస్తాం.'- సంజయ్ చౌబే, సీఎండీ, ఈసీఐఎల్
ఈసీ-విక్రమ్ ప్రత్యేకతలు..
* పరికరం 220 గ్రాములు మాత్రమే ఉంటుంది.
* 10-45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ పనిచేస్తుంది.
* గ్రాఫిక్ డిస్‌ప్లే , లొకేషన్ ట్రాకింగ్ ఉంటాయి.
* ఏ పరీక్షలోనైనా పరిమితికి మించి ఫలితాలు వస్తే హెచ్చరిస్తుంది.