రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 7 వందలకు చేరాయి. ఇవాళ కొత్తగా 50 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ప్రస్తుతం చికిత్సపొందుతున్న వారిలో ఎవరి పరిస్థితి విషమంగా లేదని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న 68 మందిని డిశ్చార్జ్ చేస్తున్నట్లు చెప్పారు. మొత్తం కేసుల్లో అత్యధికం మర్కజ్ సంబధించినవే ఉన్నాయని ఈటల వివరించారు.
జీహెచ్ఎంసీలోనే ఎక్కువ
రాష్ట్రంలో ఇప్పటివరకు 10 వేల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఈటల వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నమూనాల్లోనే ఎక్కువ పాజిటివ్ కేసులున్నాయని... గ్రామీణ ప్రాంతాల్లోని నమూనాల్లో తక్కువగా ఉన్నాయన్నారు. వీలైనంత ఎక్కువమందికి పరీక్షలు చేసి కరోనా కేసులను గుర్తిస్తామన్నారు. హైదరాబాద్‌లో కొత్తగా రెండు ఆస్పత్రుల్లో కొవిడ్ 19 పరీక్షలు చేసే వెసులుబాటు వచ్చిందని ఈటల చెప్పారు.
మర్కజ్ నుంచి వెళ్లి వచ్చినవారు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. గచ్చిబౌలి ఆస్పత్రిని 1500 పడకల స్థాయికి తీర్చిదిద్దాం. ఈనెల 20న ప్రారంభించబోతున్నాం. హైదరాబాద్‌లో రోజూ 3లక్షల మాస్కులు తయారవుతున్నాయి. ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు.
-ఈటల రాజేందర్, వైద్యారోగ్య శాఖ మంత్రి
ఇదీ చూడండి: వాట్సప్ చాట్‌బోట్ సేవలు ఇప్పుడు ఉర్దూలో!