అక్టోబరు ఏడో తేదీ నుంచి 15 వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై(VIJAYAWADA DURGA TEMPLE) దసరా ఉత్సవాలు జరగనున్నాయి. కరోనా నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. రోజుకు పది వేల మందికి మాత్రమే దర్శన అవకాశం కల్పించనున్నారు. అందులో నాలుగు వేల మంది భక్తులకు ఉచితంగా... వంద రూపాయలు, మూడు వందల రూపాయల టిక్కెట్‌ల ద్వారా మూడు వేల మందికి దర్శనం కల్పించున్నారు. భక్తులు ఎవరైనా ముందుగా ఆన్‌లైన్ టిక్కెట్లు పొందాల్సిందేనని స్పష్టం చేశారు. ఈసారి కరోనా టీకా వేయించుకున్నట్లు ధ్రువీకరణ పత్రాన్ని భక్తులు తమవెంట తీసుకురావాలని పేర్కొన్నారు.
నదీ స్నానాలు రద్దు..
నవరాత్రుల సందర్భంగా ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు లిఫ్ట్ సౌకర్యాన్ని నిలిపివేయనున్నారు. భక్తుల కోసం వినాయక గుడి నుంచి టోల్‌గేట్ ద్వారా కొండపైన ఓం మలుపు వరకు మూడు వరుసల మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. దర్శనం అనంతరం శివాలయం మెట్ల మార్గం నుంచి దిగువకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని వరుసల్లో శానిటైజేషన్, థర్మల్‌గన్స్‌తో తనిఖీలు చేయాలని సూచించారు. కృష్ణానదిలో స్నానాలను నిషేధించారు. భక్తులు జల్లుస్నానాలు చేసుకునేందుకు వీలుగా సీతమ్మ వారి పాదాల వద్ద మూడు వందల షవర్లు ఏర్పాటు చేయనున్నారు. దుర్గాఘాట్ నుంచి భక్తులకు ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు.
ప్రత్యేక పూజల రుసుము..
ఉత్సవాల అన్ని రోజులలో లక్ష కుంకుమార్చన చేయాలని... మూలానక్షత్రం రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు కుంకుమార్చనకు మూడు వేల రూపాయలు రుసుముగా నిర్ణయించారు. మూలానక్షత్రం రోజున టిక్కెట్ ధర ఐదు వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. అన్ని రోజులలో ప్రత్యేక చండీహోమం జరపాలని, ఈకార్యక్రమంలో భక్తులు పాల్గొనేందుకు నాలుగు వేల రూపాయలుగా టిక్కెట్ రుసుము నిర్ణయించారు. చక్రనవావర్చనలో పాల్గొనే వారు మూడు వేల రూపాయలు సేవా రుసుము చెల్లించాలని.. ఈ టిక్కెట్లను దేవస్థానం వెబ్‌సైట్‌లో పొందాలని సూచించారు.
10 లక్షల లడ్డు ప్రసాదం ..
భక్తులకు విక్రయించేందుకు ఈ తొమ్మిది రోజులకు మొత్తం 10 లక్షల లడ్డు ప్రసాదం సిద్ధం చేయాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు. వివిధ దేవాలయాల నుంచి 200 మంది సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకోవాలని నిర్ణయించారు. ఉత్సవాల్లో భాగంగా అక్టోబరు 11న అర్చక సభ.. అక్టోబరు 13న వేద సభ నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: Revanth Reddy: 'ఛార్జీలు పెంచడం.. ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం'