ఫీజు చెల్లించలేదని విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిలిపివేయరాదని హైకోర్టు పేర్కొంది. ఫీజులతో సంబంధం లేకుండా ఆన్‌లైన్ తరగతులకు అనుమతించడంతో పాటు.. వార్షిక పరీక్షలకు విద్యార్థులను నమోదు చేయాలని సెయింట్ ఆండ్రూస్, సెయింట్ లూయిస్ పాఠశాలలను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ విద్యా సంవత్సరంలో కేవలం బోధన రుసుములు మాత్రమే నెలవారీగా వసూలు చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టును గతంలో ఆశ్రయించారు.
పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. పాఠశాల అడిగిన ఫీజులో 50శాతం చెల్లించాలని.. మిగతా మొత్తం నెలవారీగా చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ తల్లిదండ్రులు దాఖలు చేసిన అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫీజులతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ ఆన్‌లైన్ తరగతులకు అనుమతించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని పిటిషనర్లను, పాఠశాలలను ఆదేశిస్తూ.. విచారణ అక్టోబరు 9కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి : వేతన బకాయిల చెల్లింపు విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం