దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) ఆఖరుకల్లా అన్ని డిస్కంల అప్పులు రూ. 4.50 లక్షల కోట్లకు చేరే అవకాశముందని ‘క్రిసిల్’ రేటింగ్ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. గతేడాదికన్నా అప్పుల భారం 30 శాతం పెరగనుందని అంచనా. తెలంగాణ డిస్కంల అప్పులు గతేడాది నాటికి రూ.5,000 కోట్లకు చేరాయి. విద్యుదుత్పత్తి కేంద్రాల (జెన్‌కో)కు ఉన్న అప్పులను చెల్లించేందుకు డిస్కంలకు ప్రత్యేకంగా రూ. 90,000 కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఆ సొమ్మును విద్యుత్ ఆర్థిక సంస్థ, గ్రామీణ విద్యుదీకరణ సంస్థలు డిస్కంలకు అప్పులుగానే సమకూరుస్తాయి.
జెన్‌కో నుంచి కరెంటు కొన్న తేదీ నుంచి 60 రోజుల్లోగా డిస్కం సొమ్ము చెల్లించాలి. ఈ గడువు తీరినా చెల్లించకుండా పేరుకుపోయిన బకాయిలు దేశవ్యాప్తంగా రూ. 84,000 కోట్లకు చేరినట్లు అంచనా. ఇలా గడువు తీరిన బకాయిలు చెల్లించేందుకు మాత్రమే కేంద్రం ఇచ్చే ప్యాకేజీ నిధులు వాడాలి. దీనివల్ల డిస్కంలకున్న ఇతర అప్పులేమీ తీరవు. వాటిపై వడ్డీలు పెరుగుతూనే ఉంటాయి.
లాక్‌డౌన్‌తో పడిపోయిన డిమాండ్
రెండున్నర నెలలుగా లాక్‌డౌన్ వల్ల దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ 40,000 మెగావాట్లు తగ్గింది. లాక్‌డౌన్‌కు ముందు దేశవ్యాప్తంగా రోజూవారీ డిమాండు లక్షా 70 వేల మెగావాట్లుంటే లాక్‌డౌన్‌లో లక్షా 30 వేల మెగావాట్లకు పడిపోయింది. తెలంగాణలో ఫిబ్రవరి 28న అత్యధికంగా 13,168 మెగావాట్ల డిమాండు ఉంటే లాక్‌డౌన్‌లో 6,000 మెగావాట్లకు పడిపోయింది. దీనివల్ల డిస్కంలకు ఆదాయం బాగా తగ్గిపోయింది. అవి మరింత నష్టాల్లో కూరుకుపోతున్నాయి.