గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్ లైన్లో నమోదుకాని ప్రజల ఇళ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను పక్షం రోజుల్లోగా ఆన్ లైన్లో నమోదు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపే ఆస్తుల వివరాలన్నీ వందశాతం ఆన్ లైన్ చేయాలని స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
వందశాతం ఆన్లైన్ చేయాలి
ఆస్తులను ఆన్ లైన్లో నమోదు చేసే ప్రక్రియను పురపాలక, అన్ని స్థాయిల్లోని పంచాయతీ అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటివరకు నమోదుకాని ఆస్తుల వివరాలన్నింటినీ వందశాతం వెంటనే ఆన్ లైన్ చేయాలని స్పష్టం చేశారు. ఆన్ లైన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎంపీవోలతో జిల్లా పంచాయతీ అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సీఎం సూచించారు. ఆస్తుల వివరాలను ఆన్ లైన్లో నమోదు చేసుకునేందుకు అధికారులకు పూర్తి వివరాలు అందించాలని ప్రజలను ముఖ్యమంత్రి కోరారు.
పారదర్శకంగా
భూరికార్డుల నిర్వహణ నూటికి నూరుశాతం పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్‌కు శ్రీకారం చుడుతున్నామన్న కేసీఆర్... లక్ష్యసాధన కోసం అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆస్తుల ఆన్ లైన్ నమోదు ప్రక్రియతో పాటు గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, డంప్ యార్డుల ఏర్పాటు, ప్రతి ఇంటికి ఆరుమొక్కలు ఇవ్వడం సహా గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని, ఇళ్లు, గ్రామాల నుంచి చెత్తతరలింపు అంశాలపై ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఇదీ చదవండి : పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించిన ఈసీ