Prakash karat Comments: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపాను గద్దెదించడమే లక్ష్యంగా సీపీఎం పనిచేస్తుందని పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ స్పష్టం చేశారు. యూపీలో సమాజ్వాది పార్టీకి మద్దతుగా పనిచేస్తామని.. మిగతా రాష్ట్రాల్లో భాజపాను ఓడించగల సత్తా ఉన్న పార్టీలకు మద్దతు తెలుపుతామని ఉద్ఘాటించారు. అల్ ఇండియా సర్వీస్ రూల్స్ మార్చడం సరైంది కాదని... అది ప్రమాదకర నిర్ణయమని అభిప్రాయపడ్డారు. భాజపా అధికారంలో లేని రాష్ట్రాలన్నీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని ప్రకాశ్ కారత్ గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సీపీఎం 3వ మహాసభలకు హాజరైన ప్రకాష్ కారత్.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమ పార్టీ విధివిధానాల గురించి తెలిపారు. సీపీఎం జాతీయ మహాసభలు కేరళలో జరుగుతాయని ప్రకటించారు.
తెరాసలో ఇప్పుడిప్పుడే మార్పు...
"అధికారం మొత్తం చేతిలో పెట్టుకునే కుట్ర దేశంలో జరుగుతోంది. కార్పొరేట్ సంస్థల కోసమే ప్రభుత్వం ఉందా..? అనే అనుమానం కలుగుతుంది. గతంలో భాజపాకి మద్దతు ఇచ్చిన తెరాసలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. తన స్టాండును స్థిరంగా కొనసాగించాలి. తెలంగాణకు మేలు జరగాలంటే.. దేశంలో భాజపాయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకుని కేసీఆర్ పోవాల్సి ఉంటుంది. భాజపాను వ్యతిరేకించే విషయంలో తెరాసకు మా మద్దతు ఉంటుంది. కానీ.. ప్రజలకు నష్టం చేసే ఏ నిర్ణయం తీసుకున్నా తెరాసను వ్యతిరేకిస్తాం. మోదీకి ఎంత ఆదరణ ఉందో 5 రాష్ట్రాల ఎన్నికలు తేలుస్తాయి. యూపీలో భాజపా ఓటమి అంచున ఉందని సర్వేలు చెబుతున్నాయి." - ప్రకాశ్ కారత్, సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు
ఇదీ చూడండి: