పంచాయతీ కార్యదర్శులకు పనిభారం తగ్గించి.. ప్రతి నెల జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
ఎక్కువ పనులు అప్పచెప్పడంతో కార్యదర్శులకు పనిభారం ఎక్కువై మానసిక వ్యథకు గురవుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రగతి, అభివృద్ధి జరిగితే అది సర్పంచ్ ఖాతాలోకి వెళ్తోందని... తప్పులు జరిగితే పంచాయతీ కార్యదర్శులను బాధ్యులు చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని చోట్ల గ్రామ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ఇటీవల జనగామ జిల్లాలో పంచాయతీ కార్యదర్శి మానసిక వ్యథకు గురికాగా.. కామారెడ్డిలో ఒక కార్యదర్శి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు.
ఉన్నత విద్య , ఉద్యోగాల్లో ఉన్న యువకులు ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పంచాయతీ కార్యదర్శులుగా చేరారన్నారు. ఇంత కష్టపడి పని చేసినా... రెండు మూడు నెలలకొకసారి జీతాలు రావడం బాధాకరమన్నారు. జిల్లా కలెక్టర్లు పంచాయతీ కార్యదర్శులను మాత్రమే బాధ్యులను చేయడం సరైంది కాదని సూచించారు.
ఇదీ చదవండి: ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన