corona effect on aviation industry : విమానయాన రంగం మళ్లీ కోలుకుంటోందన్న తరుణంలో కరోనా మూడో దశ, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ ఆ పరిశ్రమ నడ్డి విరుస్తోంది. కొవిడ్ ఆంక్షలతో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు తమ పర్యటనలను వాయిదా వేసుకుంటుండటంతో వృద్ధి తిరోగమనంలోకి జారిపోతోంది. విమానాలు ఎక్కేవారి సంఖ్య భారీగా పడిపోయి శంషాబాద్‌లోని హైదరాబాద్ విమానాశ్రయంలో 30-35 శాతం వరకు రద్దీ తగ్గినట్లు ఎయిర్‌లైన్స్ వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితి ఒడిదొడుకులతో ఇలాగే కొనసాగితే విమానయాన సంస్థలకు నష్టాలు తప్పవని పేర్కొంటున్నాయి.
అక్టోబరు 9న 48 వేల మంది రాకపోకలు
covid effect on aviation industry : కరోనా మొదటి, రెండో దశల ప్రభావం నుంచి కోలుకుని గతేడాది ఆగస్టు నుంచి విమానయాన రంగం ఊపందుకుంది. సెప్టెంబరు, అక్టోబరులో రోజూవారీ ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగినట్లు పౌర విమానయాన శాఖ కూడా ప్రకటించింది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి అక్టోబరు 9న దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు కలిపి 48 వేల మంది రాకపోకలు సాగించారు. నవంబరు, డిసెంబరులోనూ ప్రయాణికుల సంఖ్య బాగానే నమోదయ్యింది. డిసెంబరులో దేశీయ ప్రయాణికులు సగటున రోజుకు 45 వేల మంది ప్రయాణించారు. ప్రస్తుతం ఇది 28 వేలకు పడిపోయింది.
సంక్రాంతికి కాస్తంత రద్దీ
- corona effect on aviation sector : ఇటీవల సంక్రాంతి సెలవుల సమయంలో కాస్తంత రద్దీ కనిపించినా.. తర్వాత తగ్గుముఖం పట్టిందని ఎయిర్‌లైన్స్ వర్గాలు చెబుతున్నాయి.
- కొవిడ్ మూడో దశకు ముందు హైదరాబాద్ నుంచి 65 గమ్యస్థానాలకు విమానాలు తిరిగాయి.
- ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణిస్తున్న విమానాల సంఖ్య 285కు పరిమితమైంది. అంతర్జాతీయ సర్వీసులు 45 నడుస్తుండగా.. 5,400 మంది ఉపయోగించుకుంటున్నారు.
- మూడో దశ ఉద్ధృతి దృష్ట్యా విమానయాన సంస్థలు సర్వీసులను తగ్గిస్తున్నాయి. ప్రయాణికులు లేకపోతే సర్వీసులను రద్దు చేస్తున్నాయి.
ప్రయాణాలు తగ్గడానికి కారణాలు
- covid effect on airlines : మనదేశంతో పాటు అనేక దేశాల్లోనూ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం.
- ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు చూపించాలన్న కేంద్ర నిబంధన.
- వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న రాత్రివేళ, వారాంతపు కర్ఫ్యూలతో అక్కడి ఎయిర్‌పోర్టులకు చేరుకున్నప్పటికీ, గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ప్రయాణికుల భావన.
- మరీ ముఖ్యమైతే తప్ప విమానాలు ఎక్కేందుకు మొగ్గు చూపకపోవడం.
ఇదీ చదవండి : HCU: హాస్టల్ విద్యార్థులను ఇళ్లకు వెళ్లిపోవాలని కోరిన హెచ్‌సీయూ
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!