ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఓ కాంటాక్ట్ ఉద్యోగి నిరసన చేపట్టాడు. కార్యాలయంలోని ఇంజనీరింగ్ సెక్షన్ వాటర్ పార్క్లో 30ఏళ్ల నుంచి ఒప్పంద ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న తిప్పన అనే వ్యక్తిని ఇటీవల అధికారులు తొలగించారు. అందుకు ఆయన కార్యాలయం ఆవరణలో డప్పు కొట్టి వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశాడు.
భార్య అనారోగ్యం కారణంగా విధులకు హాజరు కాలేకపోయానని, దాంతో అధికారులు తన ఉద్యోగాన్ని మరో వ్యక్తికి ఇచ్చారని గోడు వెళ్లబోసుకున్నాడు. జీవనాధారం కోల్పోయి ఎలా బతకమంటారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా స్పందించలేదని పేర్కొన్నారు. అందువల్లే కార్యాలయం చుట్టూ దండోరా కొడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నానని తెలిపాడు.
ఏడాదిన్నరగా రాలేదు..!
ఏడాదిన్నరగా తిప్పన విధులకు హాజరు కాలేదని ఇంజనీరింగ్ సెక్షన్ అధికారి మల్లికార్జున తెలిపారు. పూర్తి వివరాలు కమిషనర్ తెలియజేస్తారని, ప్రస్తుతం అందుబాటులో లేరని పేర్కొన్నారు.