హైదరాబాద్ గోషామహల్లో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ అట్టహాసంగా జరిగింది. తొమ్మిది నెలల పాటు 668 మంది కానిస్టేబుళ్లు వివిధ అంశాల్లో శిక్షణ పొందారు. క్రిమినల్ చట్టాలు, నేరాల విచారణ, నిఘా, అంతర్గత భద్రత, ఫోరెన్సిక్ సైన్స్, వ్యక్తిత్వ వికాసం, ఆయుధాల వినియోగం, యోగా తదితర అంశాల్లో కానిస్టేబుళ్లు పూర్తి స్థాయిలో రాటుదేలారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త హాజరయ్యారు. కానిస్టేబుళ్ల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు రవిగుప్త మొమెంటోలు ప్రధానం చేశారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, అదనపు కమిషనర్ చౌహాన్, అదనపు ట్రాఫిక్ కమిషనర్ అనిల్‌కుమార్, డీసీపీలు విశ్వప్రసాద్, రమేశ్, కమలేశ్వర్, ఏఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లను అభినందించారు.