దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక బరిలో దిగనున్న కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ఇవాళ ఖరారయ్యే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ నేతృత్వంలో శనివారం మధ్యాహ్నం జరగాల్సిన దుబ్బాక కాంగ్రెస్ నేతల సమావేశం ఉన్నపళంగా వాయిదా పడింది. యూపీలో చోటుచేసుకున్న యువతి ఘటనపై చర్చించి కార్యాచరణ రూపకల్పన కోసం ఏఐసీసీ దిల్లీకి రావాలని పిలవడం వల్ల సమావేశం నేటికి వాయిదా పడింది. ఇందిరా భవన్లో ఇవాళ జరగనున్న ఈ సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలతోపాటు పలువురు సీనియర్ నాయకులు హాజరవుతారు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక కసరత్తు చేస్తోంది.
దుబ్బాక అసెంబ్లీ తెరాస సిట్టింగ్ స్థానం అయినందున అధికార పార్టీ అభ్యర్థికి దీటైన అభ్యర్థిని బరిలో దించే దిశలో కాంగ్రెస్ ముందుకెళుతోంది. ఇందిరా భవన్లో జరగనున్న దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా ఉప ఎన్నికల బరిలో దిగేందుకు సుముఖత చూపిస్తున్న నాయకులు అధికార పార్టీ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వగలరా అన్న అంశంపై చర్చిస్తారని తెలుస్తోంది. ప్రచార అస్త్రాలు, క్షేత్ర స్థాయిలో గ్రామాల వారీగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చెయ్యడం, మండల ఇన్‌ఛార్జిలు క్షేత్రస్థాయిలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టాలనే తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ఇవీ చూడండి: కేంద్రాన్ని నిలదీయడానికి వెనకాడం: సీఎం కేసీఆర్