కులాల పేరు మీద ప్రజల మధ్య చిచ్చు పెట్టే పని చేయవద్దని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే మాటలతో శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ కుల సంఘాలతో సమావేశమై నిజాం భూములను పంచిపెడుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం ఏంటని ప్రశ్నించారు. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని భాజపా నాయకులు అనడం మంచి పద్దతి కాదని, అక్కడ హిందువుల ఆలయాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.
పాతబస్తీ అంటే పాకిస్తాన్ కాదని... అక్కడ ఎవరైనా అనధికారికంగా ఉంటే వారిని గుర్తించి పంపించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లను కూలుస్తామని ఎంఐఎం నాయకులు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. అభివృద్ధి చేసి... ఓటర్లను ఆకర్షించాలి కాని...కుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి తాయిలాలు ప్రకటించి ప్రలోభ పెట్టడం ద్వారా కాదన్నారు. గత ఎన్నికల సమయంలో కూడా ఇదేవిధంగా కుల సంఘాలు ఏర్పాటు చేసి తాయిలాలు ప్రకటించారని ఆరోపించారు.
ఇదీ చూడండి: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సీతక్క ప్రచారం