అధిక వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఎంత ఖర్చైనా ఆదుకోవాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, హుడా మాజీ అధ్యక్షుడు కోదండ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవడం వల్లనే.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ దుస్థితి నెలకొందన్నారు. తాము రాజకీయ కోణంలో మాట్లాడడం లేదని కోదండ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరం గురించి పూర్తిగా తెలిసిన మంత్రి శ్రీనివాస్‌యాదవ్ గత ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారని కోదండరెడ్డి మండిపడ్డారు. గతంలో తెలుగుదేశం హయాంలో శ్రీనివాస్‌యాదవ్ మంత్రిగా పనిచేశారని.. ఆ విమర్శలు ఆయనకు కూడా వర్తిస్తాయని గ్రహించాలన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని, చెరువుల ఆక్రమణ జరగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. 1992లో హుడాతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలు కలిసి అధ్యయనం చేసి 110 చెరువులు ఉన్నట్లు గుర్తించామన్నారు. వాటిలో జరిగిన అక్రమణలను రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి తొలగించినట్లు కోదండ రెడ్డి తెలిపారు.
వర్షాకాలానికి ముందు.. వివిధ శాఖలు సమన్వయంతో వరద కాలువల పూడిక తీయడం, మురికినీటి కాలువల నిర్వహణ చేపట్టడం వంటి పనులు చేస్తే..భారీ వర్షాలు పడినా ఇంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్లేది కాదని కోదండరెడ్డి అభిప్రాయపడ్డారు. ముందస్తు చర్యలు లోపించే హైదరాబాద్ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు కోదండరెడ్డి.
ఇవీచూడండి: 'గత పాలకులు వ్యవహరించిన తీరు వల్లే హైదరాబాద్‌కు ఈ దుస్థితి '