రాష్ట్రవ్యాప్తంగా కొత్తరేషన్ కార్డుల పంపిణీ పండగ వాతావరణంలో సాగింది. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు... ఆహారభద్రతా కార్డులు అందించారు. పేద సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా సర్కార్ పనిచేస్తోందని ప్రజాప్రతినిధులు వివరించారు. వారంలో అర్హులైన అందరికీ కొత్తగా మంజూరైన కార్డులు అందిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మూడు లక్షల 9 వేల నూతన రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మరో మంత్రి సత్యవతి రాఠోడ్‌తో కలిసి 3 వేల మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించారు. పేదలను ఆదుకోవటంలో తెరాస సర్కార్ ముందుంటుందని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో నూతన రేషన్ షాపులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
త్వరలో కొత్త పింఛన్లు: ఎర్రబెల్లి
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... లబ్ధిదారులకు నూతన కార్డులను అందజేశారు. రాయపర్తి మండల పరిధిలోని 374 మందికి కార్డులను పంపిణీ చేశారు. త్వరలోనే కొత్త పెన్షన్లను ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో లబ్ధిదారులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులను అందించారు. అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. స్వరాష్ట్రం సిద్ధించాక ఆరు కిలోల బియ్యాన్ని రూపాయి చొప్పున అందిస్తూ పేదల ఆకలి తీర్చుతున్నట్లు వివరించారు.
అదే ప్రభుత్వ ధ్వేయం
ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్, మేడిపల్లి, కీసర మండలాల్లో నూతన రేషన్ మంజూరు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. 500 కుటుంబాలకు ఒక రేషన్ దుకాణం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కుత్బుల్లాపూర్‌లోని హెచ్ఎంటీ సొసైటీలో కొత్త రేషన్ కార్డులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అందజేశారు.
పేదలు ఆకలితో అలమటించొద్దు..
హైదరాబాద్ బేగంపేటలోని జోరాస్టిన్ క్లబ్‌లో పేదలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు. పేదలు ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా 56 వేల ఆహార భద్రతా కార్డులు మంజూరు చేసినట్లు తలసాని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా 12 వేల మందికిపైగా లబ్ధి కలగనుందని మంత్రి పువ్వాడ అజయ్ వివరించారు. సత్తుపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు.
పేదల కడుపు నింపేందుకే..
సూర్యాపేట, నల్గొండలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అర్హులైన పేదలకు కొత్త ఆహారభద్రతా కార్డులు అందించారు. నిర్మల్‌లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అందించారు. పేదల కడుపు నింపేందుకే ప్రభుత్వం కార్డులు మంజూరుచేసినట్లు వివరించారు.
నూతన రేషన్ కార్డుల్లో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. రెండేళ్ల నిరీక్షణ తర్వాత ఆహారభద్రతా కార్డులు అందించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచూడండి: CM KCR: 'ఆర్థికంగా పటిష్ఠమైన రోజే ఎస్సీలు వివక్ష నుంచి దూరం అవుతారు'