Tungabhadra Upper Canal bridge collapsed: తుంగభద్ర కాలువ పైనుంచి కూలీలతో నిండిన ట్రాలీఆటో వెళుతుండగానే వంతెన కుప్పకూలి, ఓ మహిళ గల్లంతయ్యారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ గ్రామ సమీపంలో సోమవారం జరిగింది. ప్రమాదంలో స్థానికురాలైన వ్యవసాయ కూలీ సావిత్రి నీటిలో కొట్టుకుపోగా... మరో 29 మంది కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. గ్రామస్థులు, బాధితుల కథనం ప్రకారం... ఉద్దేహాళ్‌కు చెందిన 60 మంది కూలీలు రెండు ట్రాలీ ఆటోలలో సోమవారం హెచ్చెల్సీ కాలువ అవతలి వైపున్న వేరుసెనగ పొలాల్లో కలుపుతీతకు, మిరప కాయలు కోసేందుకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తూ... 30 మంది కూలీలతో ఉన్న ఆటో కాలువ పైనుంచి దాటుతుండగానే... అనూహ్యంగా వంతెన కుప్పకూలింది. ఆటో కాలువలో ఇరుక్కుపోయింది. భయాందోళనకు గురైన కూలీలు అటూఇటూ కదలడంతో సావిత్రి అనే మహిళ కాలువలో పడిపోయి... నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమీప పొలాల్లోని రైతులు పరుగెత్తుకొచ్చి కూలీలను బయటికి తీసుకొచ్చారు. ఆటోను తాడు కట్టి బయటకు లాగారు. డి.హీరేహాళ్ ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి చేరుకుని వివరాలు సేకరించారు. నీటిలో గల్లంతైన సావిత్రి కోసం కుటుంబ సభ్యులు, స్ధానికులు గాలిస్తున్నారు.
హెచ్చరించినా.. ఉదాసీనతే
తుంగభద్ర ఎగువ కాలువ 1965లో నిర్మించారు. అప్పటి నుంచి కాలువకు, వంతెనలు, అక్విడెక్టులు, అండర్‌టన్నెల్ చానళ్లకు మరమ్మతులు లేవు. 2009లో రూ.450 కోట్లతో హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు చేపట్టింది. 65 శాతం పనులు కూడా పూర్తికాలేదు. 2019లో హెచ్‌ఎల్‌ఎంసీ పరిధిలో ఆరు ప్యాకేజీల్లో అర్ధాంతరంగా ఆగిన పనులు రద్దు చేశారు. ఇప్పటి వరకు నిర్మాణాలు పూర్తికాలేదు.
ఇదీ పరిస్థితి..
కణేకల్లు సబ్‌డివిజన్ పరిధిలో 50 వరకు వంతెనలు, అక్విడెక్టులు, యూటీలు ఉన్నాయి. ఇందులో ఎల్‌బీనగర్, అంబాపురం గేటు వద్ద పూర్తిచేశారు తప్ప మిగిలిన చోట్ల కాలేదు. కణేకల్లు హెచ్చెల్సీ సబ్‌డివిజన్ పరిధిలోని తుంగభద్ర ఎగువ కాలువపై బొమ్మనహాళ్, గణిగెర వద్ద బళ్లారి-బొమ్మనహాళ్ గుండ్లపల్లి అంతర్ రాష్ట్ర రహదారి కావడంతో వంతెనలపై భారీ వాహనాలు, బస్సులు తిరుగుతున్నాయి. ఈ వంతెనలు కూడా ఎప్పుడు కూలుతాయో అర్థం కాని పరిస్థితి బొమ్మనహాళ్, నేమకల్లు, ఉంతకల్లు, మల్లికేతి, ఉద్దేహాళ్, నాగలాపురం, చెర్లోపల్లి, మైలాపురం, ఏళంజి, కృష్ణాపురం, గొడశలపల్లి, అంబాపురం, గణిగెర,యర్రగుంట, కణేకల్లు, మాల్యం, తుంబగనూరు, మీనహళ్లి, బిదురుకుంతం, గరుడుచేడు, వన్నళ్లి, దర్గాహొన్నూరు, వసళ్లి, రాయింపల్లి, నెరమెట్ల, నింబగల్లు తదితర గ్రామాల వద్ద హెచ్చెల్సీ ప్రధాన కాలువపై నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరి ప్రమాదం పొంచి ఉందని.. ‘ఈనాడు’లో 17న ‘శిథిలావస్థకు చేరుకున్న వంతెనలు.. అవస్థల్లో ప్రజలు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది.
రెండేళ్ల కింందట..
రెండేళ్ల కిందట దర్గాహొన్నూరు, మీనహళ్లి వద్ద కూడా వంతెనలు కూలి త్రుటిలో ప్రాణాల నుంచి బయట పడ్డారు. ప్రభుత్వం మాత్రం స్పందించక పోవడంతో ప్రజల ప్రాణాలు నీటిలో కొట్టుకుని పోతున్నాయి. వంతెనలకు మరమ్మతులు చేసి ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరారు. ఈ విషయాన్ని కణేకల్లు హెచ్చెల్సీ సబ్‌డివిజినల్ డీఈఈ గంగాధరరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. హెచ్చెల్సీ కాలువపై శిథిలావస్థకు చేరిన, కూలిన వంతెనలపై అంచనాలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపామన్నారు.
ఇదీ చదవండి: Night curfew in AP: ఏపీలో ఇవాళ్టి నుంచి నైట్ కర్ఫ్యూ..