Migrant Labour Murder in warangal : ఉపాధి నిమిత్తం బిహార్ నుంచి రాష్ట్రానికి వచ్చి తన అన్నతోపాటు కూలీ పనులు చేసుకుంటున్న ఓ పదహారేళ్ల (16) యువకుడిని అనుమానంతో హత్య చేసిన ఘటన వరంగల్ జిల్లా కరీమాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. మిల్స్ కాలనీ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, బిహార్‌లో బాయ్‌ముందేపూర్ మండలం జింజర్ గ్రామానికి చెందిన మునిదిల్‌కుష్ కుమార్ అనే పదహారేళ్ల యువకుడు ఉపాధి కోసం మూడు నెలల క్రితమే కరీమాబాద్‌కు వచ్చాడు. అతని అన్న ముని దూలర్ చంద్రకుమార్ ఎస్‌ఆర్‌ఆర్ తోటలో ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు.
అన్నదమ్ములిద్దరూ రోజూ కూలీ పనికి వెళ్లేవారు. వీరికి అదే ప్రాంతంలో ఉంటున్న బానోతు నగేశ్‌తో పరిచయమైంది. సమీపంలోనే నగేశ్ అత్తగారిల్లు ఉండటంతో అతని భార్యాపిల్లలు వచ్చి వెళుతుంటారు. కొన్ని రోజుల క్రితం అన్నదమ్ములు దిల్‌కుష్ కుమార్, ముని దూలర్ చంద్రకుమార్ తన భార్య వైపు చూస్తున్నారంటూ నగేశ్ వారితో గొడవపడ్డాడు. ఇదే విషయంలో మంగళవారం రాత్రి హంటర్‌రోడ్ మినీ బ్రిడ్జి వద్ద ముని దూలర్ చంద్రకుమార్ తన స్నేహితులతో ఉండగా, అదే సమయంలో అనుమానంతో అతని వద్దకు నగేశ్, అతని బావ అశోక్, బావమరిది బన్నీతో ద్విచక్ర వాహనంపై వచ్చారు. మాట్లాడాలంటూ దూలర్ చంద్రకుమార్‌ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దూషించారు.
పోలీసుల అదుపులో నిందితులు! : అంతేకాకుండా అన్నదమ్ములిద్దరినీ చంపుతామంటూ బెదిరిస్తూ నగేశ్ దాడికి పాల్పడగా, ముని దూలర్ చంద్రకుమార్ తప్పించుకుని పారిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరిన నిందితులు ఇంట్లో నిద్రిస్తున్న దిల్‌కుష్‌కుమార్ వద్దకు చేరుకుని, ఇనుప రాడ్‌తో తలపై కొట్టి అంతమొందించారు. భయంతో పారిపోయిన దూలర్ చంద్రకుమార్ ఇంటికి ఆలస్యంగా వెళ్లగా, అప్పటికే అతని తమ్ముడు బలమైన గాయంతో రక్తపు మడుగులో కనిపించాడు. బుధవారం ఉదయం ఘటనా స్థలాన్ని ఏసీపీ నందిరాం నాయక్, సీఐ వెంకటరత్నం పరిశీలించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
5 గుంటల భూమి కోసం దారుణానికి ఒడిగట్టిన తమ్ముడు, మరదలు - అసలు ఏమైందంటే?
దారుణం - భార్య, కుమారుడిని హతమార్చి ఆత్మహత్య చేసుకున్న సిరాజ్