ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సీఎం కేసీఆర్ వేరువేరుగా లేఖలు రాశారు.
ఇక్కడ విడుదల చేస్తేనే నిజమైన నివాళి...
మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు స్మారక తపాలా స్టాంపును హైదరాబాద్‌లో విడుదల చేయాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో కేసీఆర్ కోరారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ స్మారక తపాలా స్టాంపు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని... పేర్కొన్నారు. పీవీ స్మారక తపాలా స్టాంపునకు అనుమతినిచ్చి.. దక్షిణాది రాష్ట్రాల విడిది కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు విడుదల చేయాలని కోరారు. హైదరాబాద్‌లో విడుదల చేస్తే... పీవీకి నిజమైన నివాళిగా ఉంటుందన్నారు. రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా వంగరలో జన్మించిన పీవీ నర్సింహారావు బహుముఖ ప్రజ్ఞ కలిగిన నేత, సంస్కర్త అని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. మానవ వనరుల అభివృద్ధి, అంతర్జాతీయ సంబంధాలు, గ్రామీణ అభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక, కళలు, సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లో పీవీ కీలక భాగస్వామ్యం పోషించారని కేసీఆర్ వివరించారు.
అన్ని రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేలా...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని కోరుతూ ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ రాశారు. రైల్వే, రక్షణ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్బీఐ, జాతీయ బ్యాంకుల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో నియామక పరీక్షలను ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లోనే నిర్వహిస్తున్నారని సీఎం ప్రస్తావించారు. దాని వల్ల ఆంగ్ల మాధ్యమంలో చదవని వారు లేదా హిందీ మాట్లాడే రాష్ట్రాలకు చెందని వారు తీవ్రంగా నష్ట పోతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. కాబట్టి అన్ని రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా రాసేందుకు అనుమతివ్వాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరారు.
ఇదీ చూడండి: బండి సంజయ్ సవాల్‌తో పోలీస్ బందోబస్తు