హుజూరాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగి నేతలు, ప్రజలతో మాట్లాడుతున్నారు. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం తనగుల ఎంపీటీసీ నిరోష భర్త వాసాల రామస్వామికి కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న దళిత బంధు పథకం గురించి రామస్వామితో కేసీఆర్ మాట్లాడారు. దళిత బంధు గురించి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తెలియజేయాలని సూచించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పథకమని చెప్పారు.
ఇలాంటి పథకం ఎక్కడా లేదని... రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రామస్వామికి సూచించారు. హుజూరాబాద్లో ప్రతి గ్రామానికి ఈ పథకం గురించి తెలియాలన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న ఈ పథకంపై ప్రజల్లో ఎలాంటి అపోహలు ఉండకుండా చేసేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. దాని కోసం అధికారులతో కలిసి పథకంపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. హుజూరాబాద్ నుంచి మొదలు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలుచేసి సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26న హుజూరాబాద్‌కు చెందిన దళిత నేతలంతా కలిసి ప్రగతిభవన్‌కు రావాలని కేసీఆర్ ఆహ్వానించారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దళిత జాతి గొప్పదని... వారి అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
మొండి పట్టుతో విజయవంతం చేద్దాం...
"హుజూరాబాద్ నియోజకవర్గం వేదికగా ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తోన్న దళితబంధు పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అందుకోసం మిమ్మల్ని ఎంచుకున్నాం. నియోజకవర్గం నుంచి ప్రతీ మండలానికి ఇద్దరు మహిళలు.. ఇద్దరు పురుషులు ఉంటారు. మీ మండలం నుంచి మిమ్మల్ని తీసుకున్నాం. ఈ పథకం మీద పూర్తి అవగాహన పెంచుకుని ప్రజల్లో ఎలాంటి అపోహలున్నా.. వాటిని నిర్వీర్యం చేసే బాధ్యత మీ మీద ఉంటది. దాని కోసం మీరు బాధ్యత, చిత్తశుద్ధితో కృషి చేయాలి. మీ నియోజకవర్గంలో సాధించే ఈ పథక విజయంతోనే మొత్తం తెలంగాణ దళితవర్గ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. హుజూరాబాద్లో దళిత బంధును సక్సెస్ చేసి... అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్లాల్సి ఉంటుంది. మొండి పట్టు పడుదాం. ఎట్ల సక్సెస్ కాదో చూద్దాం. అన్ని జిల్లాల్లో విజయవంతం చేసి.. దేశానికి ఆదర్శంగా మారాలి. అంత గొప్పగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మీరు ప్రగతిభవన్‌కు వచ్చాక పూర్తి వివరాలు మాట్లాడుకుందాం."- రామస్వామితో ఫోన్లో సీఎం కేసీఆర్.