రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం గవర్నర్‌తో భేటీ అయిన సీఎం కేసీఆర్... రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు. ముఖ్యమంత్రితో పాటు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ ఉన్నారు.
వారందరికీ పరీక్షలు చేశాం
కరోనా కట్టడి చర్యలు, లాక్డౌన్ పరిస్థితిని వివరించిన సీఎం కేసీఆర్... దిల్లీ మర్కజ్‌కు హాజరైన వారందరినీ గుర్తించి పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స, ఆరోగ్యం మెరుగై డిశ్చార్జ్ చేసిన వివరాలను గవర్నర్‌కు తెలిపారు.
అందుకోసమే భేటీ
లాక్ డౌన్ అమలు, పేదలు, వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ సహా ఇతర అంశాలను వివరించినట్లు సమాచారం. కరోనాపై గవర్నర్లతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ త్వరలో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించనున్నారు. దీంతో అవసరమైన సమాచారాన్ని గవర్నర్ తీసుకున్నట్లు తెలిసింది.