జిల్లాల పునర్ విభజనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు సీఎస్ నీలం సాహ్ని సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేసి నివేదించేందుకు ఇప్పటికే సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ చేసిన అధ్యయనంపై సీఎంకు వివరించినట్లు తెలిసింది.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి జిల్లా చొప్పున మొత్తం 26 జిల్లాలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. దీని ప్రకారం జిల్లాల సరిహద్దుల నిర్ణయం, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, ఆర్థిక, పాలనా పరమైన అంశాలపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను సీఎంకు సీఎస్ నివేదించారు.
జిల్లాల విభజన సమయంలో భౌగోళికంగా, సాంకేతికంగా తలెత్తుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటులో అడ్డంకిగా మారిన అంశాలను సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం. జిల్లాల పునర్విభజనకు సంబంధించి పాలనాపరమైన అంశాల్లో భాగంగా సిబ్బంది పంపకం, కేటాయింపు, బాధ్యతల పరిధి తదితర క్లిష్ట సమస్యలపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.
మరోవైపు క్షేత్రస్థాయిలోని జిల్లా కమిటీలు, ప్రాంతీయ కమిటీలు కొత్త జిల్లాలు ఏర్పాటు అయితే అవసరమైన మౌలిక సదుపాయాల సొంత భవనాలు, అద్దె భవనాలు వివరాలను సేకరించారు. జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అంశంపై ఇప్పటికే నివేదికలు రాష్ట్రస్థాయి కమిటీకి పంపించగా వీటిపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది.
జిల్లాల పునర్విభజనలో భాగంగా పోలీసు శాఖకు సంబంధించి కూడా 29 యూనిట్లు ఏర్పాటు అయ్యే అవకాశమున్నట్లు పోలీసు శాఖ చెబుతోంది. ఇప్పటికే ఉన్నరెండు పోలీసు కమిషనరేట్లకు అదనంగా మరో ఐదు చోట్ల కమిషనరేట్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ అంశాలన్నింటిపైనా సమావేశంలో సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది జనవరి నాటికల్లా నూతన జిల్లాల ఏర్పాటును ఓ కొలిక్కి తీసుకురావాలని సీఎస్ నీలం సాహ్నీకి సీఎం వైఎస్ జగన్ సూచించినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: 'త్వరలో కొత్త జీహెచ్ఎంసీ చట్టం.. వరదలకు శాశ్వత పరిష్కారం'