అధికారం దక్కలేదనే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విపక్షాలను ఉద్దేశించి ఏపీ సీఎం జగన్ పరోక్షంగా ఆరోపించారు. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారు. విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసుల బాగోగుల గురించి ఆలోచించామని అన్నారు. పోలీసులు తమ కుటుంబాలతో గడపాలని.. వారికి కూడా విశ్రాంతి కావాలన్న జగన్.. వీక్లీ ఆఫ్‌ను మొదటిసారిగా ప్రకటించిన ప్రభుత్వం తమదేనని పునరుద్ఘాటించారు. హోంగార్డులకు గౌరవ వేతనాన్ని కూడా పెంచామని.. కరోనాతో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు పరిహారం ఇస్తున్నామని చెప్పారు.
‘‘కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకూ వెనకాడట్లేదు. అధికారం దక్కలేదనే ఈ విధంగా చేస్తున్నారు. చీకట్లో ఆలయాలకు సంబంధించిన రథాలను తగలబెడుతున్నారు. ఆఖరికి సీఎంపైనా అసభ్య పదజాలం వాడుతున్నారు. ముఖ్యమంత్రిపై పరుష పదజాలం వాడటం సమంజసమేనా? సీఎంను అభిమానించేవాళ్లు తిరగబడాలి.. భావోద్వేగాలు పెరగాలని వాళ్లు ఆరాటపడుతున్నారు. వాళ్లు గెలవలేదని రాష్ట్రం పరువు తీసేందుకూ వెనుకాడట్లేదు. గిట్టనివాడు పరిపాలన చేస్తున్నారని ఓర్వలేకపోతున్నారు’’
- జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం
- ఇదీ చదవండి : Chandrababu : చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభం