వాతావరణంలో వచ్చిన మార్పులతో రాష్ట్రంలో వానల(Heavy Rain) తీరు మారిపోయింది. కురిస్తే కుంభవృష్టే అన్నట్లుగా ఉంది పరిస్థితి. 12 గంటల వ్యవధిలో 20 సెం.మీ.పైగా వర్షపాతం నమోదవుతుండడంతో నగరాలు, పట్టణాలను వరద ముంచెత్తుతోంది. ఉత్తర తెలంగాణలో 2004 నుంచి 2020 మధ్యకాలంలో కుండపోత కురిసిన ప్రదేశాలు పెరిగాయి. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం 64.5 మి.మీ. నుంచి 115.5 మి.మీ. వరకు వాన పడితే భారీ వర్షంగా భావిస్తారు. అంతకన్నా ఎక్కువ కురిస్తే అతి భారీ వర్షంగా పరిగణిస్తారు. రాష్ట్రంలో ఒక రోజులో ఎన్ని ప్రాంతాల్లో ఇలాంటి వర్షం కురిసిందనే దాంతో అంచనాలు నమోదు చేస్తారు. భారీ, అతిభారీ వర్షాలు ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్నాయి. అటవీ ప్రాంతం అధికంగా ఉన్న ఆదిలాబాద్‌తో పాటు కుమురంభీం, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, మంచిర్యాలలో ఎక్కువ కుండపోత నమోదవుతోంది. ములుగు, జయశంకర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ రూరల్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. గత ఏడాది ఆగస్టు 15న ఒక్కరోజే 20కి పైగా ప్రాంతాల్లో 200 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. వరంగల్ రూరల్ జిల్లాలో 270 మి.మీ.ల కుంభవృష్టి కురిసింది. కరీంనగర్‌లోనూ ఇంతే వాన ఒకచోట కురిసింది.
నగరాలకు ముంపు ముప్పు..
2020 ఆగస్టులో కురిసిన అతి భారీ వర్షాల(Heavy Rain)తో వరంగల్ నీటమునిగింది. అక్టోబరు 14న కురిసిన వాన హైదరాబాద్‌ను ముంచెత్తింది. ఇరవైకి పైగా ప్రాంతాల్లో 20 సెం.మీ.పైగా పడిన వానతో హైదరాబాద్ సగం జలసంద్రంగా మారింది. ఘట్‌కేసర్‌లో అత్యధికంగా 32 సెం.మీ. వాన కురిసింది. వరసగా రెండేళ్లపాటు హైదరాబాద్‌లో ఇలాంటి వాతావరణం కన్పించడంతో పర్యావరణవేత్తల్లో ఆందోళన రేగుతోంది. భారీ, అతిభారీ వర్షాలు ఒక్కరోజులో కొన్ని గంటల్లో కురుస్తుండటంతో నగరాల్లో ముంపు సమస్య పెరుగుతోంది. భవిష్యత్తులోనూ ఇలాంటి అవకాశం ఉండటంతో వరద కాలువలను విస్తరించడం, నీరు చెరువుల్లోకి చేరేలా ఏర్పాట్లు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పట్టణీకరణతో వచ్చిన వాతావరణ మార్పులతో భారీ, అతి భారీవర్షాలు పడటం పెరిగిందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ కె.నాగరత్న విశ్లేషించారు.
నైరుతి రుతుపవనాల కాలంలో 2004లో తెలంగాణ మొత్తంలో రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు(Heavy Rain) కురిస్తే... 2016 నాటికి ఆ సంఖ్య పది దాటింది. 2020 నాటికి 25 ప్రాంతాలకు పెరిగింది. 2004లో అతిభారీ వర్షాలు పడిన ప్రాంతం ఒకటి ఉంటే.. 2020 నాటికి అది నాలుగుకు చేరిందని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ(టీఎస్‌డీపీఎస్) గణాంకాలు చెబుతున్నాయి.