Recruitment exams Syllabus: రాష్ట్రంలో చేపట్టనున్న ఉద్యోగ నియామకాల పరీక్షల కోసం ఉన్న సిలబస్ (పాఠ్యప్రణాళిక)లో కొన్నిమార్పులు చేర్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ కేంద్రబిందువుగా దీని రూపకల్పనకు ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ బాధ్యతను సీఎస్ నేతృత్వంలోని రాష్ట్రస్థాయి నియామకాల కమిటీకి సర్కారు అప్పగించింది. నిపుణుల పేర్లను అత్యంత గోప్యంగా ఉంచాలని ఆదేశించింది. తెలంగాణలో సుదీర్ఘ అనుభవం, వివాదరహితులు, ఎలాంటి అభియోగాలు, ఆరోపణలు లేని వారిని మాత్రమే సిలబస్ కమిటీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. వీరి ఎంపిక అనంతరం పక్షం రోజుల్లోపు సిలబస్‌ను రూపొందించి టీఎస్‌పీఎస్సీతో పాటు ఇతర నియామక సంస్థలకు అందజేస్తారు. దీని ఆధారంగా నియామక సంస్థలు సిలబస్‌ను ప్రకటిస్తాయి. పరీక్షల నిర్వహణ అనంతరం వాల్యూయేషన్‌లోనూ వీరికి అవకాశం కల్పించే వీలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
నాడు 18 మందితో కమిటీ : ఉద్యోగ నియామకాల కోసం రాత పరీక్షలు తప్పనిసరి. కొన్నింటికి రాత, మౌఖిక పరీక్షలూ ఉంటాయి. గ్రూపు-1 లాంటి వాటికి ప్రాథమిక, ప్రధాన, మౌఖిక పరీక్షలుంటాయి. వీటికి అవసరమైన సిలబస్ సంగ్రహ రూపాన్ని నోటిఫికేషన్లకు ముందే వెల్లడిస్తారు. తెలంగాణలో కొత్త నియామకాలు తొలిసారిగా 95 శాతం స్థానికులకు రిజర్వేషన్ ప్రాతిపదికన జరుగుతున్నాయి. 2016 తర్వాత పాలనాపరంగానే గాక రాష్ట్రపరంగా అనేక మార్పులు రావడంతో పరీక్షల సిలబస్‌లోనూ వాటిని చేర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించింది. పోటీ పరీక్షల సందర్భంగా వర్తమాన అంశాలు (కరెంట్ అఫైర్స్), సాధారణ పరిజ్ఞానం (జనరల్ నాలెడ్జి), జనరల్ సైన్స్, పర్యావరణ, ఆర్థిక, సామాజిక అంశాలు, భౌగోళిక స్వరూపం, చరిత్ర, సంస్కృతి, రాజ్యాంగం, పాలన, ప్రభుత్వ విధానాలు వంటివి ప్రధానంగా ఉంటాయి. తెలంగాణ చరిత్ర, ఉద్యమ ప్రస్థానం, రాష్ట్ర ఆవిర్భావ పరిణామాలు తదితర అంశాలతో పాటు కొత్త రాష్ట్రమయ్యాక ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధి, చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టులు, జాతీయస్థాయిలో సాధించిన విజయాలు, పరిపాలన విభాగాలు, పారిశ్రామిక ప్రగతి, కొత్త జోనల్ విధానం వంటి అంశాలను సిలబస్‌లో చేర్చాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2016లో ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ, పోలీసు నియామక, ఇతర సంస్థల ద్వారా నిర్వహించిన పరీక్షలకు 18 మంది నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ఆ కమిటీ సిలబస్‌ను రూపొందించి ఆయా నియామక సంస్థలకు అందజేసింది. అదే విధానాన్ని తాజాగా పాటించాలని సర్కారు సంకల్పించింది.