ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అందుతున్న వైద్య సేవలపై చంద్రబాబు వర్చువల్ సమావేశం నిర్వహించారు. కరోనా విపత్తులో సోనూసూద్ అపార సేవలందించారని చంద్రబాబు కొనియాడారు. వలస కూలీల పట్ల సోనూసూద్ ఎంతో ఔదార్యం చూపారని పేర్కొన్నారు. మదనపల్లెలో పేద కుటుంబానికి ట్రాక్టర్ అందించారన్నారు. సమాజం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సేవ చేయడం బాధ్యతగా భావించారని ప్రశంసించారు.
కొవిడ్‌పై పోరాటంలో కుటుంబ సభ్యులు కూడా రోగుల వద్దకు వెళ్లట్లేదని చంద్రబాబు అన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్‌లైన్ వారియర్లు విలువైన సేవలందించారని పేర్కొన్నారు. సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్లందరికీ సెల్యూట్ చేస్తున్నాని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎన్నో విపత్తులు చూశా.. కరోనా వంటి సంక్షోభం చూడటం ఇదే ప్రథమం. ప్రకృతి విపత్తుల్లో ఎన్టీఆర్ ట్రస్టు, తెదేపా సేవా కార్యక్రమాలు చేపట్టింది. అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజాసేవే ప్రధాన అజెండా. కరోనా విపత్తులోనూ ఆన్‌లైన్ టెలీమెడిసిన్ ద్వారా తోచిన సాయం చేశాం. సేవ చేసేందుకు ప్రభుత్వానికి ఎన్నో అధికారాలు, వనరులు ఉంటాయి. సంక్షోభ సమయంలో ప్రభుత్వాలు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. మూడో దశ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత బాధ్యతగా ఉండాలి. అందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలి.
- చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీ చదవండి: ponnam prabhakar: 'ఆ 12 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి'