ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగోవిడత పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటనలో అక్రమాలు చోటుచేసుకున్నాయని చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొదటి 3 దశల తరహాలోనే చివరి విడతలోనూ ఫలితాలు చాలాచోట్ల తారుమారుచేశారని లేఖ రాశారు. ఎన్నికల నియమావళి ప్రకారం కౌంటింగ్ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్‌ను పట్టించుకోలేదన్నారు. ఫలితంగా చీకటి పడ్డాక కౌంటింగ్ కేంద్రాల్లో లైట్లు ఆపేసి ఫలితాలు తారుమారు చేశారని లేఖలో పేర్కొన్నారు.
విశాఖ జిల్లా పెదనగమయ్యపాలెం కౌంటింగ్ సెంటర్లో లైట్లు ఆపేసి వైకాపా అభ్యర్థికి అనుకూలంగా ప్రకటన చేశారని చంద్రబాబు మండిపడ్డారు. సింగిల్ డిజిట్ మెజార్టీ వచ్చినపుడు మాత్రమే రీ కౌంటింగ్ చేయాల్సి ఉన్నా.. విపక్షపార్టీ మద్దతుదారులకు రెండు, మూడు అంకెల మెజార్టీ వచ్చిన చోట్ల కూడా వైకాపా ఒత్తిళ‌్లతో మళ్లీ లెక్కించారని.. ఆరోపించారు. కర్నూలు జిల్లా మిట్టసోమాపురం పంచాయతీలో ప్రతిపక్ష పార్టీ బలపర్చిన అభ్యర్థి ఒక ఓటు మెజార్టీతో గెలిస్తే ఫలితం దాచిపెట్టి వైకాపా అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని ఆరోపించారు. ప్రత్యర్థులు రీకౌంటింగ్ కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనమర్లపూడిలోనూ అలాగే జరిగిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లి.. అధికార పార్టీకి అనుకూలంగా వ‌్యవహరించారని చంద్రబాబు ఆరోపించారు.
ఇదీ చదవండి: మేయర్, డిప్యూటీ మేయర్ల బాధ్యత స్వీకరణ నేడే...