"జగన్‌కు వాటికన్ సిటీ అంటే ఆనందం.. అమరావతి అంటే కంపరం" అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. రాజధానిగా అమరావతి మార్పు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రిని చరిత్ర క్షమించదన్నారు. ఏడాది కాలంగా రైతులు ఆందోళన చేస్తుంటే సీఎంకు పట్టదా అని నిలదీశారు. విట్ అమరావతి... అని విశ్వవిద్యాలయం వాళ్లు పేరు పెడితే.. అమరావతి పేరు తీసేయించారని ఆక్షేపించారు. ఏడాదిన్నరలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా అని చంద్రబాబు నిలదీశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు.
దేవాలయాలపై దాడులను ఉపేక్షించం..
హిందూ దేవాలయాలపై దాడులను ఇక ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మసీదు, చర్చిపై దాడి జరగలేదని గుర్తుచేశారు. రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం తలతీసేసినప్పుడే.. సిగ్గుతో తలదించుకోవాల్సిన సీఎం ఇంకా ప్రతిపక్షాన్ని నిందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులతోపాటు.. మతమార్పిళ్లను అరికట్టాలని డిమాండ్ చేశారు. పాస్టర్లకు రూ.5వేలు ఇవ్వడం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనని ఆరోపించారు. హిందూ దేవాలయాలపై సీఎంకు చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు.
ఆ మంత్రిలో మార్పు రాదు
'పేకాడించి రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా మంత్రిలో మార్పు రాదు. పట్టుబడితే ఏమవుతుంది జరిమానా కట్టి బయటకు వస్తారంటారా?. బెట్టింగ్, హవాలా, పేకాట, బూతుల మంత్రులా. ఇలాంటి మంత్రులు ఉండటం ప్రజల దౌర్భాగ్యం.'
- చంద్రబాబు
పోలవరం పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాపై చేసిన ప్రగల్భాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 20 మందికిపైగా ఎంపీలున్నా.. ప్రత్యేక హోదా అడిగే కనీస ధైర్యం చేయట్లేదన్నారు. సీఎం జగన్ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు కరవయ్యాయని విమర్శించారు.
ఇదీ చదవండి: జీవన్‌రెడ్డి నివాసం వద్ద భారీగా సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు