Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో డిజైన్లు, ఇతర సవాళ్లపై కేంద్ర ప్రముఖులు, జలవనరుల నిపుణులు రెండురోజులు మేధోమథనం చేయనున్నారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సలహాదారు వెదిరె శ్రీరామ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఏప్రిల్ 22న వీరంతా పోలవరం ప్రాజెక్టు సందర్శించి పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు, ప్రస్తుత నిర్మాణసవాళ్లపై అక్కడే చర్చిస్తారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. మర్నాడు ఏప్రిల్ 23న రాజమహేంద్రవరంలో వీరంతా మేధోమథనం జరపనున్నారు.
పోలవరం ప్రాజెక్టులో కొన్ని నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోవడంతో 2020 భారీ వరదల వల్ల అనేక సమస్యలు ఏర్పడ్డాయి. ఆ సాంకేతిక సమస్యలను పరిష్కరించే క్రమంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణరంగంలో అనుభవం ఉన్న నిపుణులంతా ఈ యజ్ఞంలో భాగస్వాములవుతున్నారు. పోలవరం కోసం కేంద్రం నియమించిన డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ ప్రముఖులు, పోలవరం అథారిటీ ముఖ్యులు, కేంద్ర జలసంఘం ముఖ్యులు, కొన్ని సంస్థల ప్రతినిధులు, వివిధ ఐఐటీల నిపుణులు, పోలవరం సవాళ్ల పరిష్కారానికి తాత్కాలికంగా ఏర్పాటుచేసిన కమిటీ ముఖ్యులు ఈ పర్యటనలో పాల్గొంటారు.
పోలవరం ప్రాజెక్టులో ప్రధాన రాతి, మట్టి కట్టలతో డ్యాం నిర్మాణం చేపట్టాలి. మామూలుగా అయితే ఈ నిర్మాణ ఆకృతులు సిద్ధం చేయడం, ఆమోదం పొందడంలో పెద్ద ఇబ్బందులుండేవి కావు. 2020 భారీ వరదలకు ఆ డ్యాం నిర్మించాల్సిన ప్రదేశంలో పెద్ద ఎత్తున నదీ గర్భంలో ఇసుక కోసుకుపోయింది. అక్కడే గోదావరి గర్భంలో ఎంతో లోతు నుంచి కట్టిన డయాఫ్రం వాల్ కొంత మేర ధ్వంసమైంది. దీంతో ప్రధాన డ్యాం నిర్మాణానికి సవాళ్లు ఎదురవుతున్నాయి.
ఇప్పటికే నిపుణులు కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ఉన్న నీటిని తోడాలంటే దాదాపు రూ.2,100 కోట్లు అవుతుందని అంచనా. దీనికి ప్రత్యామ్నాయంగా డ్రెడ్జింగ్‌తో ఇసుక కోత సమస్యను సర్దుబాటు చేయవచ్చని, ఇందుకు రూ.880 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనాలు రూపొందించారు. దీనికి డీడీఆర్‌పీ దాదాపుగా ఆమోదం తెలియజేసింది. ఈ రెండు రోజుల మేధోమథనం తర్వాత తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
డయాఫ్రం వాల్ దెబ్బతిన్న మేర మరో సమాంతర డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం డయాఫ్రం వాల్ సామర్థ్యాన్ని అంచనా వేయాలని సూచించినా, అందులోనూ అనేక సవాళ్లు ఉన్నాయని చెబుతున్నారు. దీనికి తోడు దిగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వాటి పనుల తీరును నిపుణులు పరిశీలిస్తారు. ఈ అంశాలు కొలిక్కి వచ్చాక కేంద్ర జల్‌శక్తి మంత్రి షెకావత్ దృష్టికి తీసుకెళ్తారని తెలిసింది.
ఇవీ చూడండి..
ఆర్టీసీపై షార్ట్ ఫిల్మ్ తీయండి... పదివేలు సొంతం చేసుకోండి..!