మునుపెన్నడూ లేనిరీతిలో భయానక వర్షపాతం నమోదైన నేపథ్యంలో రాజకీయాలు, రాద్ధాంతం లేకుండా సహాయక చర్యల్లో నిమగ్నం కావాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇలాంటి విపత్తు సమయంలో మంత్రి కేటీఆర్ రాజకీయం చేయాల్సిన అవసరం లేదని హితవు పలికారు. హైదరాబాద్ ఎగువన హుస్సేన్‌సాగర్ నుంచి పోటెత్తుతున్న మూసీ ప్రభావిత గాంధీనగర్, నల్లకుంట, బాపునగర్, గోల్నాక, మల్లిఖార్జున నగర్ తదితర ప్రాంతాల్లో... భాజపా నాయకులు లక్ష్మణ్, రామచందర్ రావుతో కలిసి కిషన్ రెడ్డి పర్యటించారు. అరుంధతి నగర్, అరవింద్ నగర్, సూరజ్ నగర్ తదితర ముంపు ప్రాంత వాసులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ మూసీ నుంచి వస్తున్న వరద నీరు ఇళ్లల్లోకి వచ్చిందంటూ మహిళలు కిషన్ రెడ్డికి మొర పెట్టుకున్నారు. కరోనా నేపథ్యంలో విద్యుత్ సరఫరా, తాగు నీరు, వంటలు చేసుకునే పరిస్థితుల్లేక భోజనం లేకపోవడమే కాకుండా పారిశుద్ధ్యం లోపించిందని ఫిర్యాదు చేశారు. తక్షణమే పారిశుద్ధ్య నిర్వహణ, సహాయక చర్యలు తీసుకోకపోతే... అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున... సహాయక చర్యలు చేపట్టేందుకు విజయవాడ నుంచి అదనపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పిస్తున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. జంట నగరాల్లో అనేక కాలనీలు జలమయం కావడం వల్ల రోడ్లు తెగిపోయాయని... గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రేపు, ఎల్లుండి ప్రభుత్వ సహాయక చర్యల్లో భాజపా శ్రేణులు కూడా పాల్గొంటారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కుండపోత వర్షంతో అతలాకుతలమైన జంటనగరాలు