Genome editing : వ్యవసాయ రంగంలో కీలక మార్పులకు నాంది పలికే జన్యుకూర్పు (జీనోమ్ ఎడిటింగ్) విత్తనాలు, మొక్కల వినియోగానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. వాటిపై ఆంక్షలు ఎత్తివేస్తూ కేంద్ర పర్యావరణశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఇంతకాలం జన్యుమార్పిడి(జీఎం) విత్తనాల మాదిరిగానే జన్యుకూర్పు విత్తనాల విడుదలకూ కేంద్ర పర్యావరణశాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలనే ఆంక్షలున్నాయి. జన్యుకూర్పు పరిజ్ఞానంతో ఉత్పత్తి చేసే విత్తనాల్లో జన్యుమార్పిడిలో మాదిరిగా హానికారకాలు గానీ, పరాయి జన్యువులు గానీ ఉండవని, వినియోగానికి అనుమతించాలని కేంద్ర వ్యవసాయ, బయోటెక్నాలజీ శాఖల సిఫార్సు మేరకు ఈ ఉత్తర్వులిస్తున్నట్లు తెలిపింది. జీనోమ్ ఎడిటింగ్ ద్వారా ఉత్పత్తి చేసిన విత్తనాలు లేదా మొక్కల నారును కొత్త వంగడాలుగా విడుదల చేయాలని స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయం దేశ వ్యవసాయ రంగానికి మేలు చేస్తుందని, అధిక దిగుబడినిచ్చే వంగడాల విడుదలకు కొత్తబాటలు వేస్తుందని భారత జాతీయ ప్రైవేటు విత్తన సంఘం ఛైర్మన్ ఎం.ప్రభాకరరావు తెలిపారు.
జన్యుకూర్పు అంటే...
పంటల వంగడాలు, మొక్కల్లో అనేక రకాల జన్యువులుంటాయి. వీటిలో దిగుబడి పెరగడానికి, పోషక విలువలు పెంచడానికి అవసరమైన జన్యువులను కూర్చి, మిగతా వాటిని తగ్గించడం లేదా తొలగించడం ద్వారా కొత్త వంగడాలను సృష్టిస్తారు. తద్వారా దేశ ఆహార భద్రత మెరుగవడంతో పాటు ప్రజలకు పోషకాలతో కూడిన ఆహారం లభిస్తుంది. రైతులకూ అధిక ఆదాయం వస్తుంది. ఇప్పటికే పలు దేశాల్లో జన్యుకూర్పు పరిజ్ఞానంతో విత్తనాలు విడుదల చేశారు.