పదిహేనో ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశంలోని 28 రాష్ట్రాల పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్ర ఆర్థికశాఖ తొలి విడతగా రూ.15,177 కోట్ల బేసిక్ గ్రాంట్స్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు రూ.461.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.656.25 కోట్లు దక్కాయి. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్‌లకు అత్యధిక వాటా వెళ్లింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం తాజా సిఫార్సులకు అనుగుణంగా ఈ నిధులను అన్ని పంచాయతీరాజ్ సంస్థలకు పంపిణీ చేయాలని కేంద్ర ఆర్థికశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒకవేళ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులు లేకపోతే నిధులను జనాభా, ప్రాంతం మధ్య 90:10 నిష్పత్తిలో పంపిణీ చేయాలి.
కేంద్రం నుంచి నిధులు అందిన పది రోజుల్లో ఎలాంటి మినహాయింపులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని స్థానిక సంస్థలకు బదిలీ చేయాలి. గడువులోపు బదిలీ చేయకపోతే మార్కెట్ నుంచి సేకరించే రుణాల తరహాలో వీటికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిధులను పంచాయతీరాజ్ సంస్థలు జీతాలు, వ్యవస్థాగతమైన ఖర్చులకు కాకుండా స్థానిక ప్రత్యేక అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.
ఇదీ చదవండి: లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ సందేహానికి ప్రధాని స్పష్టత