శనివారం రాత్రి మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మరణించడం, వారి ద్విచక్రవాహనంలో కిలో గంజాయి దొరకడం రాజధానిలో గంజాయి రవాణా, విక్రయం పెద్ద ఎత్తున పెరిగిపోతోందనే దానికి నిదర్శనం. కొవిడ్‌తో వ్యాపారాలు సాగని మరికొన్ని రంగాల వ్యక్తులూ కొత్తగా గంజాయి మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నారు. సోమవారం ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులు 16 కిలోల గంజాయితో పేట్‌బషీరాబాద్ పోలీసులకు చిక్కడం దీన్ని ధ్రువపరుస్తోంది. ఇలా వివిధ వర్గాలు గంజాయి మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్న కారణంగానే ఈ ఏడాది ఇప్పటి వరకూ హైదరాబాద్‌లో దాదాపు పదివేల కిలోల గంజాయిని పోలీసులు పట్టుకోగలిగారు. అధికారుల కళ్లపడకుండా సరఫరా అయిన గంజాయి ఇంతకు పదిరెట్లు ఉంటుందంటే అతిశయోక్తికాదు. తాజా ఉదంతాల నేపథ్యంలో నగరంలో గంజాయి వినియోగం మరోమారు చర్చనీయాంశమైంది.
ఎన్నెన్నో ఉదాహరణలు
ఏఎస్‌రావునగర్‌కు చెందిన విశాల్(పేరుమార్చాం) ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ఉండగానే చదువు కోసం అంటూ మిత్రుల గదికి వెళ్ళి గంజాయికి అలవాటు పడ్డాడు. కొద్దిరోజుల్లోనే గంజాయి లేకుండా ఉండలేని స్థితికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులే కావడంతో జరుగుతున్న ఘోరం తెలుసుకోలేకపోయారు. ఇంట్లో డబ్బు మాయం అవుతుండటంతో అనుమానం వచ్చి కుమారుడిపై కన్నేశారు. దాంతో వ్యవహారం బయటపడింది. నిలదీసేసరికి ఎదురు తిరగడం మొదలుపెట్టాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వంట గదిలో కత్తిపట్టుకొని వీరంగం వేసేవాడు. పగలంతా పడుకునే ఉండేవాడు. సాయంత్రం అయ్యేసరికి చేతికందిన డబ్బు తీసుకొని బయటకెళ్లి మిత్రులతో కలిసి గంజాయి తాగి అర్ధరాత్రి ఇంటికి చేరుకునేవాడు. పరిస్థితి చేయిదాటుతుండటంతో తల్లిదండ్రులు పోలీసుల సాయంతో అతికష్టం మీద డీఅడిక్షన్ కేంద్రంలో చేర్చారు. చదువు మధ్యలోనే ఆగిపోవడంతో విశాల్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.
ఒక్కరితో మొదలై..
ముఖ్యంగా నగర శివార్లలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులు త్వరగా గంజాయి బారినపడుతున్నారు. ఇంటి నుంచి కళాశాలకు వెళ్లేదారిలోని నిర్మానుష్యప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని గంజాయి ముఠాలు వల విసురుతున్నాయి. ఏదైనా కళాశాలలో ఒక విద్యార్థి వీరి ఉచ్చులో చిక్కుకుంటే అతని ద్వారా రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో తయారవుతున్నారు. తర్వాతి కాలంలో వీరిలో కొందరు సరఫరాదారులుగా మారుతున్నారు.
పది అందిస్తే.. ఒకటి ఉచితం
సులభంగా అందుబాటులోకి రావడంతో రాజధానిలో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే ఇప్పుడు నగరంలో ఎక్కడికి కావాలంటే అక్కడకు గంజాయి సరఫరా చేసే ముఠాలు తయారయ్యాయి. తమ వ్యాపారం పెంచుకునే ఉద్దేశంతో వినియోగదారులనే సరఫరాదారులుగా మారుస్తున్నారు. మరోపక్క కరోనా కారణంగా వ్యాపారాలు సాగని కొందరు వ్యాపారులనూ లక్ష్యంగా చేసుకుని సునాయసంగా చాలా డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపి వారితోనూ గంజాయి రవాణా, సరఫరా చేయిస్తున్నారు. అలాగే పది పొట్లాలు తాము చెప్పిన వారికి అందిస్తే ఒక పొట్లం ఉచితంగా ఇస్తామని చెబుతుండటంతో రవాణా చేసేందుకు గంజాయికి అలవాటు పడ్డ యువత పోటీ పడుతోంది. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గతంలో ఇలా ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు పట్టుబడ్డారు. ఒక్క రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే 20 మందికిపైగా విద్యార్థులు పట్టుబడ్డారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో భారీ సాగు
ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతాల్లో ఇప్పుడు భారీగా గంజాయి సాగు జరుగుతోంది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి.) అంచనాల ప్రకారం ఇక్కడ కొన్ని వందల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉండటం, భౌగోళికంగా దుర్భరమైన ప్రాంతం కావడంతో ప్రభుత్వ అధికారులు ఇందులోకి ప్రవేశించలేకపోతున్నారు. కేవలం రవాణాను మాత్రమే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పండుతున్న గంజాయిలో కొంత కోల్‌కతా మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు, మరికొంత తమిళనాడు, కేరళకు వెళుతుండగా ఎక్కువ భాగం హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర, గుజరాత్‌తోపాటు హరియాణా వరకూ సరఫరా అవుతోంది.
పది వేల కిలోలపైనే స్వాధీనం
* నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ ఏడాది ఇప్పటి వరకూ 1,970 కిలోల గంజాయి పట్టుకున్నారు.
* మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 4వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
* డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు 4వేల కిలోల గంజాయి పట్టుకున్నారు.
* రాష్ట్ర ఆబ్కారీ శాఖ 33 కేసులు నమోదు చేసి 257 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్ మీదుగా ఇతర ప్రాంతాలకు..
ఉత్తరాంధ్రలో పండుతున్న గంజాయి హైదరాబాద్ మీదుగా ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతోంది. నిఘా సమాచారం మేరకు చాలావరకూ పట్టుకోగలుగుతున్నాం.
- మహేష్ భగవత్, రాచకొండ కమిషనర్
- ఇదీ చూడండి : లైంగిక దాడి కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల కారాగారం