Muralidhar Rao on Paddy Procurement: పాలనా వైఫల్యాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే.. తెరాస ధాన్యం అంశాన్ని రాజకీయం చేస్తోందని భాజపా సీనియర్ నేత మురళీధర్‌రావు మండిపడ్డారు. ఇన్నాళ్లు ధాన్యం కేంద్రమే కొంటుండగా.. రాష్ట్రం కొన్నట్లు చెప్పుకోలేదా? అని చురకలంటించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై తెలంగాణ సర్కార్ రైతులకు కనీస అవగాహన కల్పించలేదన్న మురళీధర్‌రావు.. కేంద్రంపై నిందలు వేసి కర్షకుల్లో వ్యతిరేకత పెంచే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని ఒప్పుకుని సంతకం చేశారో..? లేదో? తెరాస నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైసుబ్రాన్ ఆయిల్ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని కేంద్రానికి హామీ ఇచ్చారని.. ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు మురళీధర్‌రావు.
దిల్లీ ప్రయాణం.. అందుకే : తెరాస సర్కార్ కేసీఆర్ నాయకత్వంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. గత 8 ఏళ్లుగా దేశం మొత్తం ధాన్య సేకరణలో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. మరి వివక్ష ఎక్కడ ఉంది? తెలంగాణపై మోదీ ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపెట్టడం లేదు. ధాన్యం సేకరణ విషయంలో తెరాస, కేసీఆర్ పూర్తిగా అబద్ధం చెబుతున్నారు. అబద్ధాలతో రాజకీయ లబ్ది పొందే వ్యూహం పన్నుతున్నారు. దిల్లీ వర్సెస్ తెలంగాణ అనేదే వస్తే వారు నిలబడగలుగుతామనుకుని ప్రజల్లో సెంటిమెంట్ రగుల్చుతున్నారు. అబద్ధపు ప్రచారానికి బలం ఉండదు. మళ్లీ మళ్లీ దిల్లీ ప్రయాణం.. ప్రజల దృష్టి మరల్చేందుకే.
- మురళీధరరావు, భాజపా జాతీయ నాయకుడు
BJP Muralidhar Rao News: వరి ధాన్యం విషయంలో తెరాస సై అంటే సై అని.. ఢీ అంటే ఢీ అని భాజపా జాతీయ నేత మురళీధరరావు అన్నారు. తెరాస దిల్లీ వెళ్తే.. తాము గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్తామని చెప్పారు. ప్రత్యామ్నాయ పంట వేసుకోమని చెప్పి.. ప్రణాళిక చూపెట్టలేని ప్రభుత్వం కేసీఆర్‌ది అని విమర్శించారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం, సరఫరా పెరిగాయని ఆరోపించారు. తెలంగాణలో భాజపా, తెరాస కుటుంబ పార్టీ మధ్యే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. దేశ ఐక్యతే భాజపా రాజకీయమన్న మురళీధరరావు.. గ్రామగ్రామానికి వెళ్లి జాగృతి తీసుకొచ్చిన ఘనత కమలం పార్టీదని తెలిపారు.
- ఇదీ చదవండి : ఉభయసభల నుంచి తెరాస ఎంపీల వాకౌట్