తమ కుటుంబాన్ని దేశం నుంచి బహిష్కరిస్తారా అని భూమా అఖిలప్రియ సోదరి భూమా మౌనిక అన్నారు. తమపై ఉగ్రవాదులపై పెట్టే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. గాంధీ ఆస్పత్రి సీసీఫుటేజీ పరిశీలిస్తే తన సోదరి అఖిలప్రియతో తెలంగాణ పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరించారో తెలుస్తుందని అన్నారు.
" అఖిలప్రియను చంపేద్దామనుకుంటున్నారా? మాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మా అక్కకు పౌర హక్కులు వర్తించవా..?. వైద్యుల విధులు కూడా పోలీసులే నిర్వహిస్తారా? సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. భూముల ధరలు పెరిగాయని పోలీసులు ఎలా చెబుతారు? రెవెన్యూ శాఖ చెప్పాల్సింది కూడా పోలీస్ శాఖ చెబుతుందా? వేరే రాష్ట్రాల్లో ఎవరికీ ఆస్తులు ఉండకూడదా? సెటిలర్ల ప్రాణాలకు తెరాస జవాబుదారీగా ఉండదా?"
- భూమా మౌనిక
భూమా అఖిలప్రియ ఆరోగ్యం బాగాలేదని ఆమె చెల్లెలు భూమా మౌనిక అన్నారు. ఆమె సోదరి తప్పు చేసిందనడానికి ఎలాంటి ఆధారాలు లేకుండానే జడ్జిమెంట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఒక టెర్రరిస్టులా అఖిలప్రియను తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన అక్క ప్రాణాలతో ఉంటుందో లేదోనని భయపడుతున్నామని మౌనిక అన్నారు. భూవివాదం తమ తండ్రి భూమా నాగిరెడ్డి బతికున్నప్పటి నుంచి ఉందని తెలిపారు. తమ తండ్రి నంద్యాలకో, ఆళ్లగడ్డకో పరిమితమైన వ్యక్తి కాదని, ఉమ్మడి ఏపీలో తమ తల్లిదండ్రులకు గౌరవప్రదమైన గుర్తింపు ఉందని చెప్పారు. ఎలాంటి వివాదమైనా కూర్చొని మాట్లాడుకుంటే తేలిపోతుందని, ఆస్తుల కోసం తమను ఇంతగా వేధిస్తారా అని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్ వచ్చినవారు తెరాసకు ఓటు వేయలేదా అని భూమా మౌనిక అడిగారు.
- ఇదీ చూడండి అఖిలప్రియ ఆరోగ్యంపై కోర్టులో మెమో దాఖలు