ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని 2014లో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 15 వేల ఎకరాలను సేకరించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ అప్పట్లో స్థానికంగా తీవ్ర వ్యతిరేకత రావటంతో రెండో దశగా 5 వేల 311 ఎకరాలకు తగ్గించి ప్రభుత్వం తిరిగి నోటిఫికేషన్ విడుదల చేసింది. చివరికి 2వేల 644 ఎకరాల్లోనే నిర్మాణం తలపెట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. విజయనగరం జిల్లాలోని కంచేరుపాలెం, కవులవాడ, గూడెపువలస, ఎ. రావివలస, సవరవిల్లి, రావాడ రెవిన్యూ గ్రామాల పరిధిలో విమానాశ్రయం రానుంది.
ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో 2200 ఎకరాల్లోనే విమానాశ్రయం నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. మిగతా 424 ఎకరాలను వాణిజ్య అవసరాలకు వినియోగించడం కోసం ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకోవాలని యోచిస్తోంది. అదేవిధంగా పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి జీఎంఆర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విమానాశ్రయం రాకతో స్థానికుల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే ఆనందం వ్యక్తం అవుతోంది. అలాగే రైతులు పీఓటీ యాక్ట్‌లో కోల్పోయిన భూమికి ప్రభుత్వం తగిన సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
విమానాశ్రయం నిర్మాణ స్థలాన్ని కుదించటంపై పౌర విమానయాన మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఆక్షేపించారు. ప్రయాణికులతో పాటు, ఏయిర్ క్రాప్ట్ మెయిన్‌టెనెన్స్, కార్గో సర్వీసుల కోసం భోగాపురం ఎయిర్‌పోర్టును డిజైన్ చేశాం. నిర్మాణంలో తాజా సవరణలతో అనేక ఉద్యోగాలు పోతాయంటున్నారు. ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి పెరగాలంటే గతంలో డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ని కొనసాగించాలని అశోక్ గజపతి రాజు డిమాండ్ చేస్తున్నారు.
విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం పూర్తయితే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలవనుంది. తీర ప్రాంతానికి అతి దగ్గరలో నిర్మితమవుతున్న తొలి విమానాశ్రయంగా భోగాపురం నిలిచిపోనుంది.
ఇవీ చూడండి: స్వచ్ఛతే ఆరోగ్య సోపానం.. అవగాహనే కీలకం